ఎమోషన్ కి ప్రమోషన్ కి తేడా తెల్సా బన్నీ?

Update: 2017-07-05 07:06 GMT
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు రివ్యూల గురించి కాసింత గట్టిగానే అక్షింతలు వేశాడు. రివ్యూ రైటర్ల గురించి పెద్ద క్లాసే ఇచ్చాడు. ఇదే విషయం ఎవరన్నా రివ్యూయర్లను అడిగితే మాత్రం.. మనోడు అక్షింతలు వేశానని.. క్లాసు ఇచ్చానని.. అనుకుంటున్నాడు కాని.. అసలు ఏం చెబుతున్నాడో తనకే అర్ధం కాకుండా పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్. ఇంతకీ వారి వాదన ఏంటో ఒకసారి విందామా.

రివ్యూయర్లు ఏమంటున్నారంటే.. నిజానికి అమెరికాలో తన సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్ళిన బన్నీ ఒక మాటన్నాడు. ''మీరు మీ అమ్మను ఇష్టపడుతున్నారు. అదొక ఎమోషన్. దానికి రేటింగ్ ఇస్తారా? అలాగే సినిమా కూడా ఒక ఎమోషన్'' అని చెప్పాడు. ఇక్కడ ఎమోషన్ అనే పదాన్ని కామన్ గా వాడేశాడు కాబట్టి.. అదేదో డైలాగ్ పర్ఫక్ట్ గా ఉంది 10కి 10 మార్కులు అనుకుంటున్నాడు కాని.. అక్కడే తప్పులో కాలేశాడు. అసలు డిజె దువ్వాడ జగన్నాథమ్ లో లేనిదే ఎమోషన్. బాహుబలి సినిమాను కూడా ఉదహరించిన బన్నీ.. ఆ సినిమాలోని ఎమోషన్ మరియు డిజె సినిమాలోని ఎమోషన్ కంపేర్ చేసుకోవాల్సింది. అప్పుడు తెలిసేది ఆ 'ఎమోషన్' అంటే ఏంటో.. అంటున్నారు రివ్యూయర్స్.  

అలాగే మరో ఉదహారణ కూడా వినిపిస్తోంది. బాహుబలి ఇంటర్వెల్ బ్యాంగులో ఒక వ్యక్తి రాజుగా కాకుండా సైన్యాధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. జనాల్లో పండిన ఎమోషన్.. అలా స్ర్కీన్ పై పండిన ఎమోషన్ చూసి తెర ముందు కూర్చున్న ఆడియన్స్ ఉద్వేగానికి గురవ్వడం.. అది ఒక టాప్ గేర్ ఎమోషన్. ఇలా డిజె లో ఏదన్నా ఒక్క సీన్ ఉందా?? చిన్నప్పటి నుండి ఒకడు చదువూ సంద్యలు చదివాడో లేదో కాని.. ఏదో కాల్చుకుంటూ వెళిపోతుంటాడు. అది కూడానూ వాళ్ల నాన్నను ఒకడు చెంపమీద కొట్టడం చూసి.. వాడు చంపడం మొదలెడతాడు. సభ్యసమాజానికి ఇందులో మెసేజ్ కాని.. అలాగే ఎమోషన్ కాని.. రెండూ లేవు. కాని రివ్యూయర్లు స్టోరీ రొటీన్ అని మాత్రమే చెప్పారు. ఒక పెద్ద హీరో కదా.. బోలెడెంత డబ్బులు ఈ సినిమాలో పెట్టారు కదా.. అనే ఎమోషన్ తో ఎవ్వరూ కూడా ఏమనలేదు. కాని బన్నీ మాత్రం.. తల్లి ప్రేమ ఎమోషన్ కు రేటింగ్ ఉందా అంటూ అసలు సంబంధం లేని ఒక డైలాగ్ చెప్పాడనేది రివ్యూయర్ల వాదన.

ఇంకోమాట ఏంటంటే.. మరి వెలకట్టలేని ఎమోషన్ ను రేటింగ్ చేయకూడదు కాని.. అలాంటి ఎమోషన్లను పండించడానికి కోట్లకు కోట్లు డబ్బులు తీసుకోవచ్చా? వందల్లో టిక్కెట్లు అమ్మేసి ఆడియన్స్ ను పిలవొచ్చా? అలా పిలుస్తున్నారంటే ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నారనే అర్ధం. మరి ఒక ప్రొడక్ట్ జనాలు కొనాల్సినప్పుడు దాని రివ్యూలు చూసుకోరా?? అది తమ మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుందో లేదో తెలుసుకోరా?? సో సినిమాలను ఒక ప్రొడక్టుగా అమ్మడం కరక్ట్ అని తెలిసిన బన్నీ, పైగా ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు అయ్యుండీ, ఆ సినిమాలను రివ్యూ చేయొద్దూ రేటింగ్ ఇవ్వొద్దూ అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ రివ్యూయర్లు కూడా ఫైర్ అవుతున్నారు.

ఇకపోతే.. ఒక వ్యక్తి రాసిన రివ్యూ.. ఒక వ్యక్తి ఇచ్చిన స్టార్లు.. ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ ఆపాదిస్తున్నారు అంటూ మరో పంచ్ వేశాడు అల్లు అర్జున్. దీనిపై కూడా సినిమా క్రిటిక్స్ కాస్త గట్టిగానే స్పందిస్తున్నారు. ఇక్కడే బన్నీ ఒక విషయం మర్చిపోయాడట.  ''వెబ్ సైట్లలో రివ్యూ అయినా.. న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీ ఆర్టికల్ అయినా.. చివరకు ఒక సినిమా అయినా.. ఒక వ్యక్తి రాసిందే. ఒక వ్యక్తే రాస్తాడు.. కాని మెజార్టీ ప్రజానీకానికి వారి ఆలోచనలకూ అద్దంపట్టేలా వారిని అలరించేలా ఆలోజింపజేసాలా రాస్తాడు. ఒక సింగిల్ పర్సన్ హరీశ్ శంకర్ ఒక్కడే ఒక కథ దానికి మాటలు రాసేస్తే అది కోట్ల మందికి నచ్చేలా ఉంటుందని బన్నీ నమ్మేస్తాడు కాని.. ఒక రివ్యూ రైటర్ రాసే రివ్యూ మాత్రం అందరికీ ఆపాదించకూడదు అంటే ఎలా? మనం ఏం చేస్తున్నామో ఏం చెప్తున్నామో అస్సలు ఆలోచించక్కర్లేదా బన్నీ?'' అని క్రిటిక్స్ ప్రశ్నిస్తున్నారు.

డిజె సినిమాకు ఒకవేళ 100 కోట్లు గ్రాస్.. లేదంటే 150 కోట్లు గ్రాస్ వచ్చినా కూడా.. సినిమా అయితే క్లాసిక్ పీస్ మాత్రం కానే కాదంటున్నారు సినీ విమర్శకులు. ఈ కథలోని లోటుపాట్లు తెలుసుకుని.. రొటీన్ కంటెంట్ ను ఆడియన్స్ చూస్తున్నాకాని వారికి అలాంటివి నచ్చట్లేదు అని అర్ధంచేసుకుని.. పంచె కట్టి పంచ్ డైలాగులు వేయడం కాకుండా పవర్ఫుల్ కమర్షియల్ సినిమాలు తీసి ఇదే రివ్యూయర్లు చేత ఐదు స్టార్లు కూడా వేయించుకోవచ్చు అంటున్నారు. ''సినిమా బాగుంటే.. బన్నీయే స్వయంగా ఫోన్ చేసి '0' రేటింగ్ ఇవ్వమని చెప్పినా కూడా.. రివ్యూయర్లు 5కి 5 స్టార్లు ఇస్తారు. బాగోకపోతే మాత్రం.. కలక్షన్లు 100 కోట్లు దాటినా కూడా.. బాగోలేదనే చెబుతారు. అది వాస్తవం'' అంటూ కొందరు రివ్యూయర్లు కామెంట్ చేశారు.

ఇదే కాదండోయ్.. రివ్యూయర్లు ఇంకో మాట చెబుతున్నారు. 'యావరేజ్ సినిమా తీశాం. కాకపోతే పాటలు కామెడీతో నింపాం. కథ లేకపోయినా మీరు 2 గంటలు ఎంజాయ్ చేస్తారు' అంటూ నిజం చెప్పడానికి ఈగో అనే ఎమోషన్ అడ్డురావడంతో.. ఇలా రివ్యూయర్లకు ఎమోషన్ లేదు అంటూ సినిమాను ప్రమోట్ చేయడం.. ఎమోషన్ కు ప్రమోషన్ కు తేడా తెలియకపోవడమే అంటున్నారు. మరి బన్నీ విమర్శలకు క్రిటిక్స్ చేసిన ప్రతి విమర్శలపై మనోడు ఎలాంటి కామెంట్స్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News