పెద్దమనసు చాటుకున్న స్టైలిష్ స్టార్

Update: 2018-12-26 14:20 GMT
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీలు మందుకు వచ్చి తమకు చేతనైన సహాయం చేస్తూ ఉంటారు.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతంలో ఎన్నో సార్లు ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి.   ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించడానికి బదులుగా నేరుగా సహాయం చేస్తానని బన్నీ ప్రకటించాడు. తన టీం తుఫాను బాధిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడి వారికి ఏం కావాలో తెలుసుకుంటుందని ప్రకటించాడు.

అల్లు అర్జున్ ఆ హామీని ఈమధ్య నెరవేర్చాడు.  శ్రీకాకుళం లో చాలా ప్రాంతాలకు శుభ్రమైన మంచి నీటి సరఫరా లేదు.  ముఖ్యంగా చాలా చోట్ల భూగర్భ జలాలు తాగడానికి అనువైనవికాదు.  ఇక తుఫానులు లాంటివి వచ్చినపుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే  ఈ జిల్లాలోని  నాలుగు గ్రామాలకు(కొండలోగాం.. దేవునాల్తడ.. అమలపాడు.. పోలాకి) మూడు ఆర్. ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. ఒక బోర్ వెల్ కూడా వేయించాడు.  ఈ పనుల వల్ల కనీసం ఎనిమిది వేలమందికి స్వచ్చమైన తాగునీరు అందుతుందని అంటున్నారు.

శ్రీకాకుళంలో చాలామంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. ఇలాంటి ప్రాంతాలలో ఆర్. ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది స్థానికుల ఆరోగ్యాలను కాపాడినట్టే అవుతుంది.  అల్లు అర్జున్ ఈ విషయంలో చూపించిన చొరవకు.. ఉదార స్వభావానికి ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  ఆ గ్రామాల ప్రజలే కాదు నెటిజనులు అల్లు అర్జున్ చేసినపనిని మెచ్చుకుంటున్నారు.  ఇదిలా ఉంటే ఈమధ్య నాగబాబు.. వరుణ్ తేజ్ లు జనసేన పార్టీకి 1.25 కోట్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
    
    
    

Tags:    

Similar News