సత్యమూర్తి స్పెషల్‌: కట్టుబాట్లేల బన్నీ?

Update: 2015-04-09 13:45 GMT
బన్ని నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తి రిలీజైంది. అయితే ఈ సినిమాలో బన్నీ నటనపై రకరకాల రివ్యూలొచ్చాయి. సత్యమూర్తి కొడుకుగా విలువలు వెతుక్కుంటూ వెళ్లే నవతరం కుర్రాడిగా బన్ని ఈ చిత్రంలో నటించాడు. విలువలే ఆస్తి అన్న ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టు హీరో పాత్ర ప్రవర్తించిన తీరు బావుంది కానీ బన్నికి ఇలాంటి మూడీగా ఉండే క్యారెక్టర్‌ సూటవ్వదు అన్న విమర్శలొచ్చాయి.

అయితే ఈ చిత్రంలో బన్ని తనవంతు పాత్రను సవ్యంగానే పోషించాడు. దర్శకుడు త్రివిక్రమ్‌ పోసిన మూసలోకి సరిగ్గానే ఒదిగిపోయాడు. త్రివిక్రమ్‌ ఎప్పటిలాగే సన్నివేశాల్లో హీరో పాత్ర ద్వారా తత్వం బోధించాలనుకున్నాడు. అందువల్ల బన్ని ఒక తత్వవేత్తలా కనిపించాడు. అయితే బైట మాస్‌కి, యూత్‌కి కావాల్సింది తత్వం కాదు. కిక్కు. ఎమోషన్‌, కుటుంబ సెంటిమెంట్‌ అంటూ కట్టుబాట్లు విధించడం వల్ల బన్ని పాత్రలో కిక్కులేకుండా పోయిందని విమర్శలొస్తున్నాయి.

ఒక రేసుగుర్రంలా, ఒక జులాయిలా, ఒక ఆర్యలా కనిపిస్తేనే బన్నీని యువతరం యాక్సెప్ట్‌ చేసే పరిస్థితి. ఎందుకంటే అలాంటి పాత్రల్లో అతడి ఎనర్జీని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ప్రతిసారీ ఒకే తరహా పాత్రల్లో చూపించడం కుదరదు కాబట్టి త్రివిక్రమ్‌ ఈ కొత్త ప్రయోగం చేశాడు. బన్నిని అత్యంత క్లాస్‌ కుర్రాడిలాగా చూపించాడు. ముఖ్యంగా అంతగా జీవంలేని పాటలకు బన్ని తన క్లాసిక్‌ స్టెప్పులతో జీవం పోశాడు. కానీ అవి అతడి ఎనర్జీకి తగ్గ స్టెప్పులు కాదని ఎవరైనా చెప్పేస్తారు.

ఇలా ఏ కోణాన్ని టచ్‌ చేసినా 'సెంటిమెంటు' అనే పదం బన్ని ముందరి కాళ్లకు బంధం వేసింది. లుక్‌ మారింది, స్టయిల్‌ కుదిరింది. కానీ ఎందుకో కిక్కేలేదు. అదీ సంగతి.
Tags:    

Similar News