ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి నాకేమి పైత్యం లేదు: బన్నీ

Update: 2021-12-17 09:30 GMT
ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో స్టార్స్ అంతా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలో ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్తీ - కిచ్చా సుదీప్ వంటి పలువురు హీరోలు తెలుగులో డబ్బింగ్ చెప్పడం మనం చూస్తున్నాం.

టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమ సొంత గొంతుతోనే పక్క ఇండస్ట్రీలలో పాపులర్ అవ్వాలని చూస్తుంటారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' కోసం జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ తెలుగుతో పాటు హిందీ - కన్నడ - తమిళంలో కూడా డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

'పుష్ప' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ తెలుగులో తన పాత్రకు సొంత వాయిస్ ఇచ్చుకున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ మాత్రం కేవలం తెలుగులోనే డబ్బింగ్ చెప్పడం గమనార్హం. అయితే దీనికి గల కారణాన్ని బన్నీ వివరించారు.

''తెలుగు వరకే డబ్బింగ్ చెప్పాను. 'పుష్ప' మిగతా వెర్సన్స్ కు చెప్పలేదు. నాకు తమిళ్ వచ్చు కానీ.. సినిమా బాగా రావాలని చెప్పలేదు. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్తే కచ్చితంగా సినిమా పాడైపోతుందని తెలుసు. నాకేమీ సొంత పైత్యం ఉండదు.. నేనెప్పుడూ సినిమా బాగుండాలని అనుకుంటాను'' అని అల్లు అర్జున్ అన్నారు.

ఇంకా బన్నీ మాట్లాడుతూ.. ''యాక్సెంట్ డిక్షన్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఏ భాష అయినా అక్కడి వారే డబ్బింగ్ చెప్పాలి. అది సినిమా చూసేప్పుడు కచ్చితంగా ఒక ఫీలింగ్ తీసుకొస్తుంది. మనం ఎంత కాదన్నా ఒక హిందీ నటుడు తెలుగు డబ్బింగ్ చెబితే.. మనకు ఎక్కడో కొడుతూనే ఉంటది. తెలుగు వ్యక్తినైన నేను వేరే లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చెప్పినా అలానే ఉంటుంది. అందుకే సినిమాకు ఇబ్బంది లేకుండా క్లీన్ గా ఉండాలనే మిగతా వెర్సన్స్ లో అక్కడి వాళ్ళతోనే ట్రై చేశాం'' అని చెప్పారు.

నిజానికి అల్లు అర్జున్ చెప్పిన దానికి ఏకీభవించవచ్చు. ఎందుకంటే తెలుగేతర భాషలలో డబ్బింగ్ చెప్పడం వల్ల అక్కడి నేటివిటీ టచ్ తప్పుతుంది. అందులోనూ 'పుష్ప' సినిమాని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా రూపొందించారు. పుష్పరాజ్ గా బన్నీ చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడతారు. ఇతర భాషల్లో అదే డిక్షన్ తో డైలాగ్స్ చెప్పలేకపోవచ్చు. అందుకే అల్లు అర్జున్ తెలుగులో మాత్రమే డబ్బింగ్ చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారు.

కాకపోతే కొంతమంది నటీనటులు ఇతర భాషలలో బాగా డబ్బింగ్ చెప్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' ట్రైలర్ చూస్తే ఇద్దరు హీరోలు కూడా సొంత గొంతుతో ఆకట్టుకున్నారు. మలయాళం భాష పలకడం స్థానికేతరులకు కష్టం కాబట్టి.. ఆ వెర్షన్ కు మాత్రం డబ్బింగ్ చెప్పలేదని చెబుతున్నారు. మరి తమిళ కన్నడ హిందీ భాషల్లో తారక్ - చరణ్ ల వాయిస్ లు ఎలా మెప్పిస్తాయో చూడాలి.
Tags:    

Similar News