'అల్లు ఆర్మీ' అనేది ఆర్గానిక్..!

Update: 2022-10-20 04:16 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా సినిమాకు తన ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తున్న బన్నీ.. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. 'పుష్ప' సినిమాతో సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

మెగా బ్రాండ్ తో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో తమని తాము ఒక ఆర్మీగా చెప్పుకుంటుంటారు.

ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు.. నాకు మాత్రం ఆర్మీ ఉంది అని అల్లు అర్జున్ కూడా ఎప్పుడూ సరదాగా అంటుంటారు. తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆర్మీ ఉందని గర్వంగా చెబుతుంటారు. అయితే ఈ 'అల్లు ఆర్మీ' ఎలా ఏర్పడిందనే విషయం మీద లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో హీరో అల్లు శిరీష్ స్పందించారు. అల్లు ఆర్మీ ఆర్గానిక్ గా ఏర్పడిందని.. అది ప్లాన్ చేసింది కాదని తెలిపారు.

"ఫ్యాన్స్ అందరూ వాళ్లకు వాళ్లే ఆర్మీ అని పిలుచుకుంటూ రావడంతో అది సెమీ అఫిషియల్ గా అయింది. ఫ్యాన్ అనేది రెగ్యులర్ గా ఉందని అల్లు అర్జున్ అభిమానులంతా 'ఆర్మీ' అని పిలుచుకున్నారు. ముందు అల్లు అర్జున్ యువత అని ఉండేవాళ్లు.. వాళ్లలో కొందరు యంగ్ ఫ్యాన్స్ ఆర్మీ అనేది స్టార్ట్ చేశారు. రానురాను అది ఇప్పుడు అఫిషియల్ అనే విధంగా మారిపోయింది. ఆన్‌ లైన్‌ తో పాటు ఆఫ్‌ లైన్‌ లోనూ శక్తిగా మారింది'' అని అల్లు శిరీష్ అన్నారు.

అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం ''ఊర్వశివో రాక్షసివో'' రిలీజ్ రెడీ అవుతోంది. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ రొమాంటిక్ చిత్రాన్ని నవంబర్ 4న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' సినిమా కోసం సన్నద్ధం అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంచి. 'పుష్ప' పార్ట్-1 సంచలన విజయం సాధించడంతో.. ఇప్పుడు రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సినిమాని తీయాలని మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

'పుష్ప: ది రైజ్' లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్మగ్లర్ గా ఎలా ఎదిగాడనేది చూపించారు. 'పుష్ప 2' లో ఎలాంటి కథ చెప్పబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News