చాలా కాలంగా విజయాల కోసం ఎదురుచూస్తున్న వారిలో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. మనోడి బ్యాడ్ లక్ ఏమిటో గాని చేసిన ప్రతి సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వడం లేదు. అన్నయ్య సపోర్ట్ మెగా స్టార్ మద్దతు బాగానే ఉన్నా కూడా వారి స్తాయిలో హిట్స్ అందుకోవడం లేదు. చివరగా ఒక్క క్షణం అనే సినిమాతో వచ్చిన అల్లు శిరీష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు. ఒక మలయాళ కథను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి మంచి స్టార్ డమ్ తెచ్చిన సినిమా ABCD (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేసి). ఈ సినిమాతో అతని కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. నటనకు ప్రాధాన్యత ఉన్న కథ. గతంలో తెలుగులో కొంత మంది యువ హీరోలు ఈ కథ రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా అల్లు శిరీష్ ఆ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఒక రిచ్ ఎన్నారై యువకుడు ఇండియాకి వచ్చి నార్మల్ లైఫ్ ని కొనసాగించాలి. అప్పుడు అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది అసలు పాయింట్.
ఈ కథలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో పాటు మంచి కామెడీ ఉంటుంది. దుల్కర్ సల్మాన్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. మరి అల్లు శిరీష్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కొత్త దర్శకుడు సంజీవ్ ఈ రీమేక్ కథను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత త్వరగా ఇదే ఇయర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.