#ట్రెండీ టాక్.. అమెరికా వ‌సూళ్ల‌కు పెద్ద వెసులుబాటు

Update: 2021-10-26 07:08 GMT
క‌రోనా దెబ్బ‌కి సినిమా రంగం ఎంత‌గా కుదేలైందో చెప్పాల్సిన ప‌నిలేదు. 24 శాఖ‌ల‌తో పాటు.. డిస్ట్రిబ్యూట‌ర్లు..ఎగ్జిబిట‌ర్లు అంతా తీవ్ర సంక్షోభంలో ప‌డ్డారు. ముఖ్యంగా థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌కు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు అయింది. క‌రోనా ముందు నుంచే ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్లు సినిమా రిలీజ్ చేయాలంటే నానా అవ‌స్థ‌లు ప‌డేవారు. క‌రోనా దెబ్బ‌కి ప‌రిస్థితి మ‌రింత క్షీణించింది. ప్ర‌భుత్వం నుంచి ప్రోత్సాహ‌కాలు కూడా అంతంత మాత్రంగా ఉండ‌టంతో థియేట‌ర్ వ్య‌వ‌స్థ మ‌రింత కుంటుప‌డింది. ప‌రిస్థితులు అదుపులోకి రావ‌డంతో మ‌ళ్లీ అంతా ఊపిరి తీసుకుంటున్నారు. ఇక అమెరికా థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌కి వ‌స్తే.. తెలుగు సినిమాకు అమెరికా మార్కెట్ అత్యంత కీల‌కం అన్న సంగ‌తి తెలిసిందే.

అక్క‌డ మార్కెట్ యూఎస్.. సీడెడ్ తో స‌మానం. క‌రోనా మొద‌లైన నాటి నుంచి అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ లేక‌పోవ‌డంతో అక్క‌డ మార్కెట్ అత‌లాకుత‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యూ ఎస్ ఫిల్మ్ ట్రేడ్ డిస్ట్రిబ్యూట‌ర్లు ఎగ్జిబిట‌ర్ల‌కు ఓ శుభ‌వార్త చెప్పింది. సినిమాను ఆదుకునే ప్ర‌క్రియ‌లో భాగంగా ఉద్దీప‌న‌గా సినీ మార్క్..రీగ‌ల్..ఏఎమ్ సీ వంటి అనేక పెద్ద థియేట‌ర్ల చైన్ సిస్ట‌మ్ వ‌ర్చువ‌ల్ ప్రింట్ ఫీజ్ (వీపీఎఫ్) ను మిన‌హాయింపు ఇచ్చింది. ఇత‌ర చిన్న చైన్ సంస్థ‌లు ఖ‌ర్చుల‌లో యాభైశాతం వ‌ర‌కూ మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ఆఫ‌ర్ చేసాయి. పంపిణీ రంగాన్ని.. థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ను కాపాడాలి అనే ఉద్దేశంతోనే వీపీఎఫ్ లో మినహాయింపులు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఇది పెద్ద సినిమాల‌కు ఊపిరి పోసే బిగ్ ఆఫ‌ర్ అని చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలో అగ్ర హీరోల సినిమాల‌కు వీపీఎఫ్ ఆఫ‌ర్ తో గ‌ణ‌నీయంగా ఖ‌ర్చు త‌గ్గుంతుంద‌ని తెలుస్తోంది. స్టార్ హీరోల‌ చిత్రాల రిలీజ్ ని ప్రోత్స‌హించ‌డానికి యూ.ఎస్ మార్కెట్ ఈ వెసులుబాటు క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. అక్టోబ‌ర్ నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వ‌చ్చింది. డిసెంబ‌ర్ 17 న `పుష్ప` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ముందుగా ఈ ఆఫ‌ర్ ని `పుష్ప` సినిమాకు ద‌క్కే ఛాన్స్ ఉంది. మ‌రోవైపు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న `అన్నాథే`(పెద్ద‌న్న‌) కూడా రిలీజ్ అవుతుంది. చిరు-ఆచార్య‌.. ఎన్.బి.కే-అఖండ కూడా డిసెంబ‌ర్ వార్ నే ఫిక్స‌యితే వీళ్ల‌కు కూడా క‌లిసొచ్చే వీలుంటుంది.
Tags:    

Similar News