బాలీవుడ్ లో ఒక మెగా కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. ఒకప్పుడు ఇండియన్ సినిమాను ఏలి.. 70 ప్లస్ లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. గత కొన్నేళ్లలో ఇంతింతై అని ఎదిగి ఇండియన్ సినిమాలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఆ చిత్రం పేరు.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. లెజెండరీ ప్రొడక్షన్ హౌజ్ ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ ఈ డ్రీమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించబోతోంది. ధూమ్.. ధూమ్-2 సినిమాలకు రచయితగా పని చేసి.. ఆ తర్వాత ‘ధూమ్-3’తో దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య అమితాబ్-ఆమిర్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
బాలీవుడ్ లో మల్టీస్టారర్లు కొత్తేం కాదు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ తో కలిసి అమితాబ్ చాలా సినిమాలే చేశాడు. ఇంకా చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించాడు. కానీ ఆమిర్ తో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా జట్టు కట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. యశ్ రాజ్ ఫిలిమ్స్ సెట్ చేసిన కాంబినేషన్ ఆ అంచనాలకు తగ్గట్లే ఉంది. ఇంగ్లిష్ టైటిల్ పెట్టారంటే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికే ప్లాన్స్ వేసినట్లు తెలుస్తోంది. ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే ఈ చిత్రానికి విడుదల తేదీ కూడా ప్రకటించేసింది యశ్ రాజ్ ఫిలిమ్స్. 2018 దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.