బిగ్ బీకి మరో ఛాలెంజింగ్ రోల్ .. మిథునం రీమేక్ లో అమితాబ్

Update: 2020-11-29 02:30 GMT
తెలుగులో ‘మిథునం’ చిత్రం గొప్ప క్లాసిక్​గా నిలిచింది. శ్రీరమణ రచించిన ‘మిథునం’ నవల ఆధారంగా తనికెళ్ల భరణి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కేవలం రెండే పాత్రలుంటాయి. భార్యభర్తలుగా ఎస్పీ బాలూ, లక్ష్మి ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్​ చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్​కు చెందిన ఓ ప్రముఖ సంస్థ ఈ కథ హక్కులు కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో అమితాబ్​ బచ్చన్​ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అమితాబ్​ కోసం ఈ సినిమా రీమేక్ హక్కులను సదరు నిర్మాణ సంస్థ కొనుగోలు చేసిందట. ప్రస్తుతం బాలీవుడ్​లో కథల కొరత ఏర్పడింది. దక్షిణాది నుంచి కథలను తీసుకెళ్తున్నారు. అయితే కమర్షియల్ గా మిథునం పెద్దగా హిట్​కాలేదు. కానీ కథాపరంగా ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అటువంటి చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్​లో తెరకెక్కించడం సాహసమే.

అయితే విభిన్న పాత్రలు చేసేందుకు అమితాబ్​ బచ్చన్​ ఎప్పుడూ ముందుంటారు. దీంతో మిథునంలో ఆయన నటించేందుకు ఒప్పుకున్నారట. అయితే లక్ష్మి చేసిన పాత్రను హిందీలో ఎవరు చేస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. బాలసుబ్రహ్మణ్యం అప్పటికే ఎన్నో పాత్రలు పోషించినా.. ఓ లీడ్​ రోల్​లో మిథునంలోనే నటించారు. ముందుగా ఈ సినిమాకు ఎల్​బీ శ్రీరాంను ఎంపికచేశారు. కానీ వివిధ కారణాల వల్ల ఆయనను పక్కనపెట్టారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తనికెళ్ల భరణికి కూడా మంచి పేరొచ్చింది. నవలా చిత్రాన్ని ఆయన ఎంతో చక్కగా తెరకెక్కించారు.

తెలుగులో నవలా చిత్రాలు రావడం కొత్త కాదు. గతంలో మహల్ లో కోకిల ఆధారంగా సితార అనే చిత్రం వచ్చింది. ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి రచించిన ఎన్నో నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. సెక్రటరీ సినిమాగా ఘనవిజయం సాధించింది. యండమూరి నవల అభిలాష కూడా హిట్​ అయ్యింది. అయితే ఓ కళాత్మక నవలను తెరకెక్కించడంలో తనికెళ్ల భరణి సక్సెస్​ అయ్యారని చెప్పొచ్చు.అయితే బాలీవుడ్ లో తెరకెక్కనున్న మిథునం సినిమా షూటింగ్​ ఎప్పుడు ప్రారంభిస్తారు. దర్శకత్వం ఎవరు వహిస్తారు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
Tags:    

Similar News