నా వల్ల కాదని నిర్మాత వెళ్లిపోయాడట

Update: 2018-03-25 06:26 GMT
యువ కథానాయకుడు రామ్ కెరీర్లో చాలా వరకు మాస్ మసాలా సినిమాలే చేశాడు. అప్పుడప్పుడూ క్లాస్ టచ్ ఉన్న ‘నేను శైలజ’ తరహా సినిమాలు కొన్ని చేశాడు కానీ.. జానర్ మరీ ప్రయోగాలైతే ఏమీ చేయలేదు. ఐతే తొలిసారిగా అతను ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ చేయడానికి రెడీ అయ్యాడు. ‘గరుడవేగ’తో సత్తా చాటుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అతను నటించబోతున్నాడు. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఓ కొలిక్కి వచ్చాక ఈ చిత్రం మొదలు కావాల్సి ఉంది. ఐతే నిర్మాతను సెట్ చేసుకుని స్క్రిప్టు పని చకచకా కానిస్తున్న సమయంలో ఈ చిత్రానికి పెద్ద ఇబ్బంది తలెత్తినట్లు సమాచారం.

నిర్మాత ‘భవ్య క్రియేషన్స్’ ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారట. ఈ చిత్రానికి బడ్జెట్ మరీ ఎక్కువ అయ్యేలా ఉండటమే ఇందుకు కారణమని సమాచారం. ఈ చిత్రాన్ని చాలా వరకు యూరప్ లోనే చిత్రీకరించాల్సి ఉందట. బడ్జెట్ రామ్ మార్కెట్ స్థాయికి మించి చాలా అవుతుందని తేలడంతో ఆనంద్ ప్రసాద్ తప్పుకున్నారట. ప్రవీణ్ గత సినిమా ‘గరుడవేగ’కు కూడా ఓవర్ బడ్జెట్ అయింది. రాజశేఖర్ మార్కెట్ గురించి పట్టించుకోకుండా భారీగా ఖర్చు పెట్టించాడు ప్రవీణ్. ఖర్చుకు తగ్గ ఔట్ పుట్ కనిపించింది కానీ.. హీరో మార్కెట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. రామ్ సినిమాకు కూడా అలాగే ఖర్చయ్యేలా ఉండటంతో ఆనంద్ ప్రసాద్ సైడైపోయారట. మరో నిర్మాత దొరకని పక్షంలో రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ లైన్లోకి  వచ్చే అవకాశముంది.
Tags:    

Similar News