అనిల్ రావిపూడి.. రాజమౌళి సరసన చేరినట్లేనా..?

Update: 2022-05-28 09:30 GMT
టాలీవుడ్ లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు అనిల్ రావిపూడి. 'పటాస్' వంటి హిట్టు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్.. ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 'సుప్రీమ్' 'రాజా ది గ్రేట్' 'F2' 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు 'ఎఫ్ 3' చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ఫ్రాంచైజీలో ''ఎఫ్ 3'' చిత్రాన్ని తెరకెక్కించారు అనిల్ రావిపూడి. దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ అల్టిమేట్ కామెడీ ఎంటర్టైనర్ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. తొలి రోజు పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు క్రిటిక్స్ సానుకూలమైన రివ్యూలు ఇచ్చారు.

అప్పుడే 'F3' సినిమా బాక్సాఫీస్ లెక్కల గురించి వ్యాఖ్యానించడ తొందర అవుతుంది కానీ.. టాక్ మరియు  సమీక్షలు చూస్తుంటే మంచి ఓపెనింగ్స్ ఖాయమని అర్థం అవుతుంది. ఈ మూవీ ఘనవిజయం సాధిస్తే.. దర్శకుడు అనిల్ రావిపూడి టాలీవుడ్ లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్లే.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటి వరకు 100% సక్సెస్ రేటును మెయింటైన్ చేస్తూ అపజయం ఎరుగని దర్శకధీరుడు అనిపించుకున్నారు. కొరటాల శివ మొన్నటిదాకా అదే బాటలో వచ్చినా.. 'ఆచార్య' చిత్రంతో దర్శకుడి విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఇప్పుడు అనిల్ ఖాతాలో వరుసగా ఆరో హిట్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజమౌళి స్థాయిలో అనిల్ రావిపూడి భారీ బ్లాక్ బస్టర్స్ అందుకోకపోయినా.. తనతో వర్క్ చేసిన హీరోలకు వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందించారు. వంద శాతం సక్సెస్ రేషియోను కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ విషయంలో అనిల్ కూడా రాజమౌళి పక్కన చేరినట్లే అని అనుకోవచ్చు.

ఇకపోతే 'ఎఫ్ 3' తర్వాత నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కించే ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది తండ్రీ కూతురు మధ్య నడిచే కథ అని.. బాలయ్య కూతురుగా శ్రీలీల నటించనున్నారని వెల్లడించారు.

బాలకృష్ణ ఇందులో 50 ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో కనిపిస్తారని.. పోకిరి - అర్జున్ రెడ్డి లాంటి చిత్రాల మాదిరిగా సినిమా మొత్తం బాలయ్య క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుందని అనిల్ చెప్పారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవ్వరూ ఈ కోణంలో చూపించలేదని.. తను బాలయ్యను చూసే కోణం వేరేగా ఉందని.. అది చాలా థ్రిల్లింగ్ గా ఉందని అన్నారు.

బాలయ్యను ఇలా కూడా చూపించొచ్చా అనిపిస్తుందని.. అయితే ఆయన స్టైల్ - మాస్ లుక్ - డైలాగ్స్ అన్నీ ఉంటాయని రావిపూడి అనిల్ తెలిపారు. సినిమాలో తన మార్క్ కామెడీ ఉండదు కానీ.. ఎంటర్టైన్మెంట్ కు డోకా ఉండదని చెబుతున్నాడు. బాలయ్యతో కొత్త ప్రయోగం చేయబోతున్నానని.. ఇది తన కెరీర్ బెస్ట్ వర్క్ గా నిలిచిపోతుందని అనిల్ ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News