వార్ లోకి `అన్న‌పూర్ణ స్టూడియోస్` జాతీయ‌ OTT

Update: 2020-10-22 01:30 GMT
టాలీవుడ్ లో ఓటీటీ వార్ అంత‌కంత‌కు ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. కొంద‌రు నేరుగా సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం వంద‌ల కోట్లు వెద‌జ‌ల్లేందుకు డేర్ చూపిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం జాతీయ ఓటీటీ వేదిక‌ల‌తో టై అప్ లు పెట్టుక‌ని భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

మొద‌టి కేట‌గిరీలో అల్లు అర‌వింద్ ఇప్పటికే ఆహా అనే ఓటీటీని ప్రారంభించి విజ‌య‌ప‌థంలో న‌డిపించేందుకు అహోరాత్రులు శ్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టికే వంద‌ల కోట్లు మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అగ్ర‌నిర్మాత కం బిజినెస్ మేన్ అల్లు అర‌వింద్ ... పారిశ్రామిక వేత్త కం మీడియా దిగ్గ‌జం మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ (10 టీవీ య‌జ‌మాని) తో క‌లిసి ఆహా కోసం పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తున్నారు.

ఇప్ప‌టికే ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు బ‌డా ప‌ర్స‌నాలిటీస్ తెలుగు ఓటీటీల‌పై క‌న్నేశార‌న్న స‌మాచారం ఉంది. ఇందులో అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన అన్న‌పూర్ణ స్టూడియోస్ కూడా రేసులో ఉంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఆహా త‌రహాలో సొంత ఓటీటీని ప్రారంభించ‌క‌పోయినా.. ప్ర‌ముఖ జాతీయ ఓటీటీల‌తో టై అప్ లు పెట్టుకుని క‌థ న‌డిపించేస్తుండ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది.

ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోస్ టీవీ సీరియ‌ళ్ల‌తో పాటు ఓటీటీ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఆహా కోసం కూడా ఓ చెయ్యేసింది ఈ సంస్థ‌. అలాగే జాతీయ ఓటీటీల‌తో క‌లిసి ఇప్పుడు గ‌ట్టి ప్లాన్ తోనే ముందుకు సాగుతోంద‌ట‌. ప్ర‌ఖ్యాత వీఐయు ఓటీటీతో క‌లిసి నాగార్జున వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నార‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. రెజియ‌న‌ల్ భాష‌ల్లో ఈ సిరీస్ లు నిర్మించ‌నున్నార‌ట‌. ఇక‌పోతే తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్ జాతీయ ఓటీటీ నుంచి ఓ తెలుగు వెబ్ సిరీస్ కోసం కాస్టింగ్ కాల్ పిలుపు అందింది. 11 నుంచి 55 ఏళ్ల వ‌ర‌కూ ఏజ్ గ్రూప్ ఉన్న ప్ర‌తిభావంతులైన ఆర్టిస్టులు కావాలి అంటూ కాల్ వ‌చ్చింది. మొత్తానికి అన్న పూర్ణ స్టూడియోస్ కూడా ఓటీటీ వార్ లో దిగిన‌ట్టే. భ‌విష్య‌త్ లో ఇది ఎలాంటి కొత్త సాంప్ర‌దాయాల‌కు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News