'కాంగ్రెస్' ప్ర‌ధాని పాత్ర‌లో 'బీజేపీ' న‌టుడు

Update: 2017-06-07 11:51 GMT
"కాంగ్రెస్" ప్ర‌ధాని పాత్ర‌లో బీజేపీ అనుకూల వ్యక్తి, బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ క‌నిపించ‌బోతున్నారు. "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్"చిత్రంలో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ పాత్ర‌ను అనుప‌మ్ ఖేర్ పోషించ‌నున్నారు. ఈ విష‌యాన్ని అనుప‌మ్ ఖేర్  మీడియాకు వెల్ల‌డించారు. స‌మ‌కాలీన రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌ను పోషించ‌డం ఓ పెద్ద‌ స‌వాల్ అని అనుప‌మ్ ఖేర్ అన్నారు. అటువంటి స‌వాళ్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డం త‌న‌కిష్ట‌మ‌ని ఆయ‌న చెప్పారు. మ‌న్మోహ‌న్ పాత్ర‌లో ప్ర‌జ‌ల‌ను మెప్పిస్తాన‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌న్నారు.

మ‌న్మోహన్ హ‌యాంలో మీడియా సలహాదారుగా ప‌నిచేసిన‌ సంజయ్ బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ః  ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మ‌న్మోహ‌న్ సింగ్‌ ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. 2019లో జ‌ర‌గ‌నున్న‌ సాధారణ ఎన్నికల కంటే ముందుగానే 2018 డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మే 2004 నుంచి ఆగస్ట్ 2008 వరకు మన్మోహన్ సలహాదారుగా సంజయ్ బారు ప‌నిచేశారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఈ వివాదాస్ప‌ద పుస్తకం విడుదలైంది. సోనియా చేతిలో మ‌న్మోహ‌న్ కీలుబొమ్మ‌గా మారార‌ని త‌నపుస్త‌కంలో ఆరోపించారు.

అనుప‌మ్ ఖేర్ అధికారికంగా రాజ‌కీయాల్లో చేర‌లేదు. కానీ, బీజేపీ అనుకూలుడిగా ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉంది. ఆయ‌న భార్య‌, బాలీవుడ్ న‌టి కిర‌ణ్ ఖేర్ 2014లో బీజేపీ ఎంపీగా గెలుపొందారు. 2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక అనుప‌మ్ ఖేర్‌కు 2016లో ప‌ద్మ భూష‌ణ్ ప్ర‌క‌టించ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.
Tags:    

Similar News