'చంద్రముఖి' సీక్వెల్లో అనుష్క?

Update: 2021-09-19 03:30 GMT
చంద్రముఖి .. 2005 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రజనీకాంత్ .. నయనతార .. ప్రభు .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. విద్యాసాగర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'రా రా .. ' అంటూ చంద్రముఖి పాడే పాట ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఒక సినిమాను ప్రభావితం చేయగల అలాంటి పాట ఇంతవరకూ మళ్లీ రాలేదనే చెప్పాలి.

ఆత్మలు .. ప్రతీకారాలు .. ఆవహించడాలు వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. కానీ హారర్ కు సైన్స్ ను జోడించి .. కామెడీని కలిపి అందించిన దర్శకుడు పి.వాసు ప్రతిభ కారణంగా, ఈ సినిమా రజనీ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. భయపెట్టడానికి భయంకరంగా మేకప్ చేయకుండా .. ఎక్కడ రక్తపాతం చూపించకుండా వాసు ఈ కథను నడిపించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. అప్పటి నుంచి కూడా ఆయన ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాడు. కానీ రజనీ మళ్లీ ఈ కథను టచ్ చేయడానికి అంతగా ఆసక్తిని చూపడం లేదనే వార్తలు వచ్చాయి.

అందువల్లనే నేమో హారర్ సినిమాల స్పెషలిస్ట్ గా మార్కులు కొట్టేసిన లారెన్స్ తో ఈ సినిమాను రూపొందించడానికి వాసు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'శివలింగ' తెలుగు .. తమిళ ప్రేక్షకులను భయపెడుతూనే ఆదరణ పొందింది. అందువలన మరోసారి రంగంలోకి దిగుతున్నారు. స్క్రిప్ట్ తో .. నిర్మాతలతో వాసు సిద్ధంగా ఉన్నాడు. టైటిల్ రోల్ కోసం అనుష్క అయితే బాగుంటుందని భావించిన ఆయన, ఆమెను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

చంద్రముఖి సీక్వెల్ కి అనుష్క తగిన నాయిక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పైగా తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది .. అందుకు తగిన మార్కెట్ ఉంది. అందువలన ఆమె కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట. 'నిశ్శబ్దం' తరువాత అనుష్క మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. 'సింగం 3' తరువాత తమిళంలో మరో సినిమా చేయలేదు. అభిమానులు మాత్రం ఆమె నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ఒప్పిస్తే ఈ సినిమాకి ఒక్కసారిగా బజ్ పెరిగిపోతుందని భావిస్తున్నారట. మరి అనుష్క ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
Tags:    

Similar News