మళ్లీ 'సైజ్ జీరో' లుక్ లో అనుష్క..?

Update: 2022-07-31 02:30 GMT
కొన్నేళ్ళు సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణించిన అనుష్క.. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా 17 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకుంది. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న స్వీటీ శెట్టి.. 'అరుంధతి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి సినిమాలతో స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ఏర్పరచుకుంది. అయితే ఇటీవల కాలంలో ఆమె సినిమాలు బాగా తగ్గించేసింది.

'నిశ్శబ్దం' మూవీతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించిన అనుష్క.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఓ మూవీ చేస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ పి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో యువ హీరో 'జాతి రత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఇది అనుష్క కెరీర్ లో 48వ చిత్రం.

ప్రస్తుతం #Anushka48 సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది. చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి మళ్లీ బిగ్ స్క్రీన్‌ పై కనిపించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. అయితే ఈ మూవీలో అనుష్క శెట్టి లుక్‌ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. అనుష్క ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతోంది. దీని కోసం ఆమె మళ్లీ బరువు పెరిగిందట. అందుకే ఇప్పుడు మీడియాకు దూరంగా ఉంటోందని అంటున్నారు. మేకర్స్ సైతం సెట్స్‌ నుంచి అనుష్క ఫోటో ఏదీ ఆన్‌ లైన్‌ లో లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

నిజానికి అనుష్క 48వ సినిమా గురించి చిత్ర బృందం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె లుక్ రివీల్ చేయకపోవడానికి కారణం కూడా ఇదేనని చెబుతున్నారు. అనుష్క ఇటీవల ఇండస్ట్రీలో 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆమెతో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేశారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు కానీ.. అనుష్క ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీన్ని బట్టి ఆమె మునుపటి కంటే బరువు పెరిగి కొత్త లుక్ లో కనిపించబోతోంది కాబట్టే.. అఫిషియల్ గా ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఎక్కడా రివీల్ అవ్వకుండా చూసుకుంటున్నారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి 'బాహుబలి 1' 'రుద్రమదేవి' తర్వాత అనుష్క నటించిన 'సైజ్ జీరో' సినిమాలోని తన పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగింది. తన ఇమేజ్ ను పక్కన పెట్టి బాడీ గురించి ఆలోచించకుండా.. పాత్ర కోసం బొద్దుగా మారడంతో ఆమె డెడికేషన్ ను అందరూ మెచ్చుకున్నారు. అయితే అనుష్క తిరిగి మునుపటి లుక్ లోకి రావడానికి చాలా సమయమే పట్టింది.

'సోగ్గాడే చిన్ని నాయనా' 'ఊపిరి' 'సింగం 3' వంటి సినిమాలలో అనుష్క కాస్త ఒళ్ళు చేసి కనిపించింది. 'బాహుబలి 2' లో సన్నగా చూపించడానికి సాంకేతికతను ఉపయోగించినట్లు టాక్ ఉంది. ఆ తర్వాత సినిమాల్లో అనుష్క కాస్త బరువు తగ్గి కనిపించింది. ఇప్పుడు మళ్లీ మూవీ కోసం బరువు పెరిగిందని రూమర్స్ వస్తున్నాయి. #Anushka48 ఫస్ట్ లుక్ వస్తే గానీ ఈ విషయం మీద క్లారిటీ రాదు.
Tags:    

Similar News