ప్ర‌ధాని మోదీ మౌనం వ‌ల్లే బాలీవుడ్ కి గాయం?

Update: 2023-01-21 08:30 GMT
ఇటీవ‌ల జ‌రిగిన‌ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సినిమాలపై అనవసరమైన ప్రకటనలు లేదా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బిజెపి పార్టీ కార్యకర్తలను హెచ్చరించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ కేంద్రంగా వివాదాలు రాద్ధాంతాల‌తో మీడియా హెడ్ లైన్స్ లో నిల‌వ‌డం స‌రికాద‌ని ప్ర‌ధాని త‌మ పార్టీ నాయ‌కుల‌కు హిత‌వు ప‌లికారు. దీనిపై తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ నిర్మాత అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని షేర్ చేసారు.

ఈరోజు (జనవరి 19) అనురాగ్ తన త‌దుప‌రి చిత్రం 'ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబ్బత్' ట్రైలర్ ను ఆవిష్కరించే క్ర‌మంలో ముంబై నగరంలో సంద‌డి చేసారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాజ‌పా పార్టీ కార్యకర్తలకు PM మోడీ చేసిన హెచ్చరిక బాలీవుడ్ వ్యతిరేక సెంటిమెంట్ ను తగ్గించడానికి అలాగే బాలీవుడ్ బ‌హిష్క‌ర‌ణ‌ ట్రెండ్ లను బహిష్కరించడానికి సహాయపడుతుందా? అని దర్శకుడు అనురాగ్ ని క్రిటిక్స్ ప్ర‌శ్నించారు.

ఈ ప్రశ్నకు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ ''నాలుగేళ్ల క్రితమే ఆయన (పీఎం మోదీ) ఇలా మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ స‌న్నివేశం వస్తుందని నేను అనుకోను. ఇది వారి పార్టీ ప్ర‌జ‌ల(నాయ‌కుల) ను నియంత్రించడం గురించి..! ఇప్పుడు విషయం చేయి దాటిపోయింద‌ని అనుకుంటున్నాను. వారు ఎవరూ ఎవరి మాట వినరు'' అని అన్నారు. మీరు నిశ్శబ్దంతో పక్షపాతాన్ని శక్తివంతం చేసినప్పుడు... మీరు నిశ్శబ్దంతో ద్వేషాన్ని శక్తివంతం చేసినప్పుడు... అది తనంతట తానుగా చాలా శక్తివంతంగా మారింది. అది (వారి) శక్తిగా మారింది. ఆ గుంపు అదుపు తప్పుతోంది... అని ఆవేద‌నను వ్య‌క్తం చేసారు.

నిజానికి ప‌లు సినీనిర్మాణ‌ సంస్థలు పార్టీలు ప్ర‌జ‌ల‌కు నాయ‌కుల‌కు మోడీ సూచ‌న‌ల‌ను ముక్తకంఠంతో స్వాగతించాయి. సినిమాలపై అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని బిజెపి నాయకులను హెచ్చరించడాన్ని మెచ్చుకున్నారు. ముంబై సినీ ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌ను కించపరిచేలా ఎవరూ అనవసర వ్యాఖ్యలు చేయవద్దని ప్ర‌ధాని అన‌డం అంద‌రికీ రుచించింది. అయితే అనురాగ్ వ్యాఖ్య‌లు అందుకు విరుద్ధంగా విశ్లేష‌ణాత్మ‌కంగా ఆలోచింప‌జేసాయి. మోదీనే అంతా చేశారు అన్న‌ట్టు ప్ర‌ముఖ‌ నిర్మాత అనురాగ్ కౌంట‌ర్ వేశార‌ని అనిపించ‌క‌మాన‌దు. ఇదంతా మోదీ మౌనం తాలూకా రిజ‌ల్ట్ అనేశాడు ఆయ‌న‌.

ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్యప్ ఇలాంటి హాట్ డిబేట్‌ లకు దూరంగా ఉండే త‌ర‌హా కాదు. ప్రజలతో క‌లిసిపోతూనే.. అనురాగ్ సోషల్ మీడియాలో బాలీవుడ్ బాయ్ కాట్ ధోరణిపై తన ఆలోచనలను పంచుకున్నారు. ప్ర‌ముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ''మేం చాలా విచిత్రమైన కాలంలో జీవిస్తున్నాం. రెండు సంవత్సరాల తరువాత కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇప్పటికీ ప్రతిరోజూ ట్రెండింగ్ లో ఉన్నాడు. అన్నిటినీ బహిష్కరించాల్సిన వింత కాల‌మిది. ఇది ఒక వైపు మాత్రమే కాదు.. అంతటా జరుగుతోంది'' అని అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం త‌ర్వాత  #బాలీవుడ్ బాయ్ కాట్ ఉద్య‌మం తీవ్ర‌త‌ర‌మైన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లోకి ఔట్ సైడ‌ర్స్ ని ప్ర‌వేశించ‌కుండా నిలువ‌రించే ఒక మాఫియా వ‌ర్గంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్య‌మం తేగ‌లిగింది. దాని ప‌ర్య‌వ‌సానం గ‌త ఏడాది ఆద్యంతం భారీ డిజాస్ట‌ర్ల రూపంలో బ‌య‌ట‌పడింది. మంచి సినిమా అని స‌మీక్ష‌లు వ‌చ్చినా కానీ అస‌లు జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌క‌పోవ‌డానికి బ‌హిష్క‌ర‌ణ ఉద్య‌మం బ‌ల‌మైన పాత్ర పోషించింద‌ని చ‌ర్చ సాగింది. ఈ క్యాంపెయినింగ్ అంతా చేస్తోంది ఒక పార్టీ కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు అంటూ కూడా చ‌ర్చ సాగింది. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ త‌మ పార్టీ నాయ‌కుల‌ను హెచ్చ‌రించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనురాగ్ లాంటి ప్ర‌ముఖుడితో పాటు చాలా మంది దీనిపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News