మూవీ రివ్యూ : అప్పట్లో ఒకడుండేవాడు

Update: 2016-12-30 18:29 GMT
చిత్రం : ‘అప్పట్లో ఒకడుండేవాడు’

నటీనటులు: నారా రోహిత్ - శ్రీ విష్ణు - తన్య హోప్ - బ్రహ్మాజీ - ప్రభాస్ శీను - రాజీవ్ కనకాల - అజయ్ - సత్యదేవ్ - సత్యప్రకాష్ - రవి వర్మ - మానస - రాజ్ మాదిరాజు తదితరులు
సంగీతం: సాయికార్తీక్
నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: నవీన్ యాదవ్
నిర్మాతలు: కృష్ణ విజయ్ - ప్రశాంతి
రచన - దర్శకత్వం: సాగర్ చంద్ర

‘అయ్యారే’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ చంద్ర.. తన రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి ట్రైలర్ వరకూ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నారా రోహిత్.. శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రైల్వే రాజు (శ్రీ విష్ణు) లీగ్ క్రికెట్లో మెరుపులు మెరిపిస్తూ జాతీయ జట్టుకు ఎంపిక కావాలని కలలు కంటున్న కుర్రాడు. ఐతే అతడి అక్క అయిన అహల్య (మానస) నక్సలైట్ నాయకుడైన సవ్యసాచి (రవి వర్మ)ను పెళ్లి చేసుకుని.. తను కూడా నక్సలైట్ అయిపోతుంది. మరో వైపు తన తండ్రి చావుకు కారణమైన నక్సలైట్లంటే ఏమాత్రం పడని పోలీస్ అధికారి  ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) వాళ్లను వేటాడే క్రమంలో రైల్వే రాజు మీద దృష్టిసారిస్తాడు. ఈ క్రమంలో తన తప్పేమీ లేకున్నా రైల్వే రాజు ఇబ్బంది పడతాడు. క్రికెటర్ గా ఎదిగే అవకాశాన్ని కోల్పోతాడు. అతడి కుటుంబం కూడా నాశనమవుతుంది. ఈ క్రమంలో అతను నేర సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు. ఇక అక్కడి నుంచి రైల్వే రాజు.. ఇంతియాజ్ అలీల మధ్య పోరాటం ఎలా సాగింది.. చివరికి ఎవరు గెలిచారు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఒక క్రికెటర్ టర్న్డ్ క్రిమినల్ కథ. 90ల నాటి నేపథ్యంలో.. నాటి కాలమాన పరిస్థితులకు అద్దం పడుతూ.. రియలిస్టిక్ అప్రోచ్ తో.. ఒక వ్యక్తి జీవిత క్రమాన్ని చూపించే బయోపిక్ లాగా సాగుతుంది ‘అప్పట్లో ఒకడుండేవాడు’.  కథ చూస్తే రామ్ గోపాల్ వర్మ తీసిన శివ.. సత్య లాంటి గ్యాంగ్ స్టర్ సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది కానీ.. దీని ప్రత్యేకత దీనికి ఉంది. పాతికేళ్ల కిందటి నేపథ్యంలో సినిమా అని చెప్పి.. ఏదో పైపైన చూపించి వదిలేయకుండా అప్పటి వాతావరణాన్ని.. పరిస్థితుల్ని తెరమీద ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.ఒక సీరియస్ కథనుఎక్కడా సీరియస్ నెస్ తగ్గకుండా.. మంచి ఇంటెన్సిటీతో ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పాడు ఈ యువ దర్శకుడు.

క్రికెట్.. నక్సలిజం.. రౌడీయిజం.. గ్లోబలైజేషన్.. ఇలా 90ల్లో సమాజంపై ఎంతో ప్రభావం చూపించిన అనేక అంశాల నేపథ్యంలో సాగే ఈ కథను ఎలాంటి తడబాటు లేకుండా.. ఆసక్తికరంగా చెప్పిన తీరు మెప్పిస్తుంది. 2 గంటల 5 నిమిషాల తక్కువ నిడివిలో ఇన్ని అంశాల్ని గుదిగుచ్చి.. ఎక్కడా ఆసక్తి పోకుండా కథను చెప్పడంలో దర్శకుడు సాగర్ చంద్ర ప్రతిభ కనిపిస్తుంది. ఈ కథను.. కథానాయకుడి పాత్రను రాయడంలో దర్శకుడికి ఎవరైనా స్ఫూర్తిగా నిలిచారేమో తెలియదు కానీ.. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా ఒక వ్యక్తి జీవితాన్ని దగ్గరుండి చూస్తున్న భావన కలుగుతుంది.

మన సినిమాల్లో క్రికెట్ ప్రస్తావన రాగానే చాలా వరకు డ్రమటైజేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన సన్నివేశాలు వాస్తవ దూరంగా కనిపిస్తాయి. నిజంగా క్రికెట్ వ్యవస్థ ఎలా ఉంటుంది.. ఓ క్రికెటర్ కెరీర్లో ఎదిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అన్నది వాస్తవిక కోణంలో చూపించే సినిమాలు అరుదు. ఈ విషయంలో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. క్రికెట్ ఆడే ప్రతి జక్కరూ రిలేట్ అయ్యేలా కథానాయకుడి పాత్ర ఉంటుంది. దర్శకుడు సాగర్ చంద్ర క్రికెట్ వ్యవస్థ గురించే కాదు.. ఇంకా 90ల నాటి కాలమాన పరిస్థితుల మీద కూడా ఎంతో స్టడీ చేసి ఈ సినిమాను రూపొందించిన సంగతి ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది.

అప్పటి పరిస్థితులపై అవగాహన ఉన్న వాళ్లందరికీ నోస్టాల్జిక్ అనిపించేలా సన్నివేశాలు తీర్చిదిద్దుకున్నాడు సాగర్ చంద్ర. అవన్నీ కథలో భాగంగానే ఉంటాయి. కథలో కంటెంట్.. మలుపులు చాలా ఉండటం వల్ల ఎక్కడా బ్రేక్ అన్నది ఉండదు. చకచకా సన్నివేశాలు సాగిపోతాయి. ఆరంభం కొంచెం నెమ్మదిగా అనిపించినా.. కథలో కాన్ఫ్లిక్ట్ మొదలయ్యాక కథనం ఊపందుకుంటుంది. శ్రీవిష్ణు.. రోహిత్ పాత్రల్లో ఏ ఒక్కదాని వైపో మొగ్గకుండా.. ఒకరిని పాజిటివ్ గా.. ఇంకొకరిని నెగెటివ్ గా చూపించకుండా ఎవరి యాంగిల్లో వాళ్లు కరెక్ట్ అనిపించేలా కథను నడిపించడం వల్ల ‘అప్పట్లో ఒకడుండేవాడు’ భిన్నంగా కనిపిస్తుంది.

ప్రధాన పాత్రధారుల మధ్య పోరు పతాక స్థాయిని అందుకునే చోట ఇచ్చిన ఇంటర్వెల్ ద్వితీయార్ధం మీద ఆసక్తి రేకెత్తిస్తుంది. ద్వితీయార్ధంలో గ్యాంగ్ స్టర్ గా శ్రీవిష్ణు ఎదిగే తీరుకు సంబంధించిన ఎపిసోడ్ బాగుంది. కానీ ఆ తర్వాత కథనం కొంచెం ఫ్లాట్ గా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ దశలో ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ సినిమాను మళ్లీ పైకి తీసుకెళ్తాయి. చివరి అరగంట సినిమాకు ఆయువు పట్టు. ఇక్కడ వచ్చే ట్విస్టు థ్రిల్ చేస్తుంది. దీనికి ఇచ్చిన జస్టిఫికేషణ్ కూడా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. సినిమాను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. చివర్లో ఎమోషన్లు చాలా బాగా పండాయి.

స్క్రీన్ ప్లేలో కొన్ని థ్రెడ్స్ ను కలిపిన తీరులోనే దర్శకుడి ప్రతిభ అర్థమవుతుంది. ఓ సందర్భంలో క్రికెటర్ అయిన హీరో ఆటలో లోపం గురించి కోచ్ ప్రస్తావిస్తాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసే బంతుల్ని కూడా లెగ్ సైడ్ ఆడటం వల్ల లాంగాన్లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోతున్నావని చెబుతాడు. దానికి బదులుగా హీరో ఈ లోపాన్ని కవర్ చేయడానికి తన దగ్గరో చిట్కా ఉందని.. కానీ అది క్రికెట్లో లీగలో కాదో తెలియదని అంటాడు. అక్కడ కట్ చేస్తే మరో సన్నివేశంలో సందర్భానుసారం ఈ చిట్కాను వాడతాడు. అలాగే చివర్లో శ్రీవిష్ణు.. రోహిత్ నుంచి ఎలా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడనే విషయానికి కలిపిన లింకు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. కథాకథనాల పరంగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ప్రత్యేకంగా నిలుస్తుంది. కాకపోతే నరేషన్ కొంచెం స్లో ఉండటం ఈ సినిమాకు మైనస్. అలాగే మాస్ ప్రేక్షకలు ఈ సినిమాతో ఎంత వరకు కనెక్టవుతారు అన్నది కొంచెం సందేహం. కంటెంట్ పరంగా చూస్తే మాత్రం ఇది ప్రత్యేకమైన సినిమా. వైవిధ్యమైన.. సీరియస్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్.

నటీనటులు:

పోస్టర్లపై నారా రోహిత్.. శ్రీవిష్ణు సమానంగా కనిపించి ఉండొచ్చు కానీ.. నిజానికి ఇది శ్రీవిష్ణు సినిమా. ఇప్పటిదాకా చిన్న స్థాయి సరదా పాత్రలే చేస్తూ వచ్చిన శ్రీవిష్ణును ఈ సినిమాలో చూసి ఆశ్చర్యపోతాం. అంతా బాగా నటించాడతను. స్టేచర్ ఉన్న హీరో చేయాల్సిన పాత్రలో శ్రీవిష్ణు ఆశ్చర్యపరిచే నటనతో మెప్పించాడు. అతడి పాత్రలో చాలా వేరియేషన్లున్నాయి. క్రికెటర్ గా ఎదగాలని కలలు కనే అమాయకపు కుర్రాడిగా పరిచయమై.. పరిస్థితుల ప్రభావంతో క్రిమినల్ గా రూపాంతరం చెందే వ్యక్తిగా వైవిధ్యం చూపించాడు శ్రీవిష్ణు. అన్ని రకాల ఎమోషన్లను అతను బాగా పండించాడు. నారా రోహిత్ తనకు అలవాటైన సీరియస్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. పాత్ర తాలూకు ఇంటెన్సిటీని రోహిత్ చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ లో అతడి నటన బాగా మెప్పిస్తుంది. హీరోయిన్ తన్య హోప్ పర్వాలేదు. ఆమెలో కొంచెం తమన్నా పోలికలున్నాయి. నటన ఓకే. బ్రహ్మాజీ కీలకమైన పాత్రలో రాణించాడు. సత్య ప్రకాష్.. ప్రభాస్ శీను.. రాజీవ్ కనకాల.. ఇలా అందరూ పాత్రలకు తగ్గట్లుగా బాగా నటించారు. చివర్లో సత్యదేవ్ కూడా ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం:

సాయికార్తీక్ పాటలు బాగున్నాయి కానీ.. సినిమాకు అవి పెద్దగా ఉపయోగపడలేదు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమా మూడ్ కు తగ్గట్లు బాగా కుదిరింది. సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేసింది బ్యాగ్రౌండ్ స్కోర్. ఛాయాగ్రహణం సినిమా పెద్ద అస్సెట్. 90ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబింపజేయడంలో నవీన్ యాదవ్ కృషి ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అప్పటి సినిమాల్ని తలపించేలా లైటింగ్.. థీమ్స్ వాడాడతను. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. ఇలాంటి కథకు సపోర్ట్ చేసినందుకు నిర్మాతలకు అభినందనలు తెలపాలి. ఆర్ట్ వర్క్.. ప్రాపర్టీస్ అన్నీ కూడా అప్పటి కాలానికి తగ్గట్లుగా సమకూరాయి. దర్శకుడు సాగర్ చంద్ర ముద్ర సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. రచనలోనే అతను ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. పైగా ఓ చిన్న సినిమాగా దీన్ని రూపొందించడం ఇంకా ఆశ్చర్యం. రెండు దశాబ్దాల కిందటి పరిస్థితులపై అతడికి ఉన్న అవగాహన..సినిమాలో చర్చించిన అనేక అంశాలపై అతడికి ఉన్న పట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కొంచెం పట్టు తప్పితే డాక్యుమెంటరీ లాగా తయారయ్యే సినిమాను అతను ఆసక్తి తగ్గకుండా తీర్చిదిద్దాడు. నరేషన్ స్లో అన్న కంప్లైంట్ మినహాయిస్తే రచయితగా.. దర్శకుడిగా సాగర్ చంద్రకు మంచి మార్కులు పడతాయి. ఈ తరం యువ దర్శకుల్లో అతను ప్రత్యేకంగా నిలుస్తాడు.

చివరగా: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

రేటింగ్-3.25/5



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

Tags:    

Similar News