ఇదేమి ఓటీటీ గ్యాంబ్లింగ్ .. నిర్మాత జేబు గుల్ల‌!

Update: 2020-12-08 10:11 GMT
వ్యాపారం న‌చ్చ‌క‌పోతే న‌చ్చ‌లేద‌ని చెప్పాలి. కానీ అలా కాకుండా వాయిదాల ప‌ద్ధ‌తిలో చెల్లిస్తామ‌ని.. న‌చ్చిన‌ప్పుడే డ‌బ్బులిస్తామ‌ని అంటే ఊరుకుంటారా? కానీ ఓటీటీ కంపెనీలు ఇష్టానుసారం ఆటాడుతున్నా ఏమీ చేయ‌లేని ధైన్యంలోకి వెళ్లిపోతున్నార‌ట మ‌న నిర్మాత‌లు. కోట్లు ఖ‌ర్చు చేసి సినిమా తీసి ఓటీటీల‌కు అప్ప‌గిస్తే అవి ఇష్టానుసారం వాయిదాల ప‌ద్ధ‌తిలో డ‌బ్బు చెల్లించే కొత్త విధానానికి తెర తీసాయ‌ట‌. అంతేకాదు ఇష్టం లేని పెళ్లిలా కుదిరిన‌‌ప్పుడు ఇచ్చే ప‌ద్ధ‌తి అవ‌లంభిస్తున్నాయంటూ ల‌బోదిబోమ‌నే వాళ్ల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోందిట‌.

అస‌లు క్రేజు లేని చిన్న సినిమాల్ని అయితే కొనేందుకు స‌సేమిరా అనేస్తున్న ఓటీటీలు హ‌క్కులు కొనుక్కున్న వాటికి కూడా స‌జావుగా పేమెంట్ చెల్లించ‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ద‌క్కిందే ద‌క్కుళ్లు అన్న‌ట్టుగా నిర్మాత త‌న చేతికి చిక్కింది తీసుకుని వెళుతున్నార‌ట‌. ఇదో ర‌కం గ్యాంబ్లింగ్ కి ఓటీటీ కంపెనీలు అల‌వాటు ప‌డ్డాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు పే ప‌ర్ వ్యూ (ఆద‌ర‌ణ‌కు త‌గ్గ‌ట్టు) విధానంలో డ‌బ్బులు చెల్లిస్తున్నాయ‌ట‌. దీంతో నిర్మాత‌ల‌కు ఏం చేయాలో పాలుపోని స‌న్నివేశం నెల‌కొంద‌ని స‌మాచారం.

ఇటీవ‌ల రిలీజైన చాలా సినిమాల స‌న్నివేశ‌మిదీ. డిజిటల్ వేదిక‌‌లు ప్రణాళికలను మార్చాయి. కొత్త స్టాండ్ తీసుకుని కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. చిన్న బడ్జెట్ చిత్రాల స్ట్రీమింగ్ హక్కులను కొనేందుకు సిద్ధంగా లేవు. అగ్ర హీరోలు కాక‌పోతే వాటిని కొనేందుకు పూర్తిగా వ్యతిరేకం. అమెజాన్ - నెట్ ‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ కంపెనీలు ఒప్పందం త‌ర్వాత చెల్లించాల్సిన‌ మొత్తాలను మూడు విడతలుగా చిత్రనిర్మాతలకు చెల్లిస్తున్నాయి. వాటిలో కొన్ని చెల్లించే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి. ఒప్పందాల తేదీలు డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా ఖరారు చేస్తున్నారు. ఈ OTT ప్లేయ‌ర్స్ క‌నీసం డీల్స్ లేకుండా వ‌దిలేయ‌నూ వ‌దిలేయ‌రు. ఇరికించి గుంజుకుంటారంతేన‌ని విశ్లేషిస్తున్నారు. ఈ ఆట‌లో చివ‌రికి నిర్మాతలే బ‌క‌రాగా మారుతున్నార‌‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఓటీటీల అనేక కొత్త నిబంధనలు విధించడంతో టాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ రాబోయే సినిమాల డిజిటల్ ఒప్పందాలను ఖ‌రారు చేయ‌డం స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లు వచ్చే వారాంతం నుండి తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నాయి. క‌నీసం ఇది క‌ష్ట‌కాలంలో నిర్మాత‌ల‌ను ఆదుకునేందుకు ఆస్కారం ఉందా? అన్న‌ది చూడాలి. ఓటీటీల‌ వెల్లువ‌తో లాభాలొచ్చేస్తున్నాయ‌ని చెప్పే వారికి కార్పొరెట్ వైఖ‌రితో క‌నువిప్పు క‌లిగే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని అర్థ‌మ‌వుతోంది.




Tags:    

Similar News