మెగా ప్రిన్స్ సినిమాలో యాక్షన్ కింగ్

Update: 2019-01-17 07:48 GMT
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రెండు సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  డిసెంబర్లో 'అంతరిక్షం' విడుదల కాగా.. జనవరిలో 'F2' రిలీజ్ అయింది.  సై-ఫై జోనర్లో తెరకెక్కిన 'అంతరిక్షం' పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నప్పటికీ ఫ్లాప్ గా నిలిచింది. కానీ పెద్దగా అంచనాలు లేని 'F2' మాత్రం సంక్రాంతి సీజన్లో మంచి వసూళ్ళతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

'F2' విజయం ఇచ్చిన జోష్ లో ఉన్న వరుణ్ తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు.  ఈ సినిమాను నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తాడని సమాచారం.  స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ.. వరుణ్ తేజ్ లు సంయుక్తంగా నిర్మిస్తారట.  ఈ సినిమాలో వరుణ్ ఒక బాక్సింగ్ కోచ్ పాత్రలో నటిస్తాడు. ఇప్పటికే ఈ పాత్రకోసం ట్రైనింగ్ తీసుకుంటూ బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకుంటున్నాడట.  ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. నటీనటులను టెక్నిషియన్లను ఫైనలైజ్ చేసే పనిలో నిర్మాతలు బిజీగా ఉన్నారు.  

ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తాడట. ఇప్పటికే అయనతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయట.  అర్జున్ ఈమధ్య తెలుగులో 'లై'.. 'నా పేరు సూర్య' సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.  డబ్బింగ్ సినిమా 'అభిమన్యుడు' లో కూడా అర్జున్ విలన్ గా నటించి మెప్పించాడు.  మరి వరుణ్ తేజ్ సినిమాలో అర్జున్ కోసం ఎలాంటి పాత్రను డిజైన్ చేశారో వేచి చూడాలి.   ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు పెడతారు.  హీరోయిన్.. ఇతర టెక్నిషియన్ల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Tags:    

Similar News