మినీ రివ్యూ: 'అతిథి దేవోభవ' అలరించిందా..?

Update: 2022-01-08 03:46 GMT
కరోనా నేపథ్యంలో పాన్ ఇండియా మూవీస్ వాయిదా పడటంతో చిన్న సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. అందులో యువ హీరో ఆది సాయి కుమార్ నటించిన ''అతిథి దేవోభవ'' సినిమా కూడా ఒకటి. నాగేశ్వర్ పొలిమేర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ఆది సరసన నువేక్ష హీరోయిన్ గా నటించింది. రోహిణి - సప్తగిరి - సూర్య - ఆదర్శ్ - రవి ప్రకాష్ - రఘు కారుమంచు - మణిచందన తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజబాబు మిర్యాల - అశోక్ రెడ్డి మిర్యాల ఈ సినిమాని నిర్మించారు. ఎప్పటి నుంచో సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న ఆది.. ఈరోజు శుక్రవారం RRR రిలీజ్ డేట్ లో 'అతిథి దేవోభవ' సినిమాని విడుదల చేశారు.

పుట్టుకతోనే మోనోఫోబియా అనే సమస్యతో బాధపడే యువకుడు అభ‌య్ (ఆది సాయికుమార్).. ఒంట‌రిగా ఉండాల్సి పరిస్థితి వస్తే ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేస్తుంటాడు. ఒంటరితనాన్ని భరించలేకపోవడాన్ని వైద్య పరిభాషలో మోనో ఫోబియా అంటారు. అలాంటి ప్రాబ్లమ్ తో ఉండే అభి.. ఎప్పుడూ నలుగురితో కలిసి ఉండటాన్ని ఇష్టపడుతుంటారు. అయితే తనకున్న లోపం గురించి తెలిసి ప్రేమించిన అమ్మాయి దూరమైందనే బాధలో ఉండగా.. వైష్ణవి (నువేక్ష) ని చూసి ప్రేమలో పడతాడు. తనకున్న మోనోఫోబియా గురించి తెలిస్తే దూరమవుతుందేమో అనే భయంతో అభి ఆ విషయాన్ని ఆమె వద్ద దాచి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరి ప్రేమకు ఎలాంటి సమస్యలు వచ్చాయి?హీరో తనకున్న లోపాన్ని హీరోయిన్ కు తెలియజేసాడా లేదా? మోనోఫోబియా నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో హీరో పాత్రకు ఏదొక లోపం పెట్టి తెరకెక్కించిన సినిమాలన్నీ దాదాపుగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 'అతిథి దేవోభవ' సినిమాలో మోనోఫోబియా అనే సమస్యను తీసుకొని థిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేశారు. విభిన్న కథాంశంతో వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వినోదంతో కూడిన థ్రిల్‌ ని ప‌రిచ‌యం చేయడంతో ద‌ర్శ‌కుడు విఫలమయ్యారు ఆడియన్స్ తీర్పు ఇచ్చేశారు.

ఫస్టాఫ్ లో కామెడీ థ్రిల్ల‌ర్‌ గా క‌థ‌ను నడిపించి.. సెకండాఫ్ లో సైకో థ్రిల్ల‌ర్‌ గా చూపించి రెంటికీ చెడ్డ రేవడిగా తయారైందని అంటున్నారు. ఆసక్తికరమైన సన్నాహాలు లేకపోవడం - స్లో నెరేషన్ మైనస్ గా చెబుతున్నారు. శేఖ‌ర్ చంద్ర అందించిన సంగీతం మరియు నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని తెలుస్తోంది. అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ ఫ‌ర్వాలేద‌నిపించుకుంటోంది. యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌కుల‌కు కాస్త కాల‌క్షేపాన్నిస్తాయి.

అభ‌య్ పాత్ర‌కు ఆది సాయికుమార్ త‌న‌వంతు న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేశారని తెలుస్తోంది. నటనలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ కొత్తగా కనిపించాడు. హీరోయిన్ నువేక్ష అందంగా ఉండటమే కాకుండా తన స్క్రీన్ ప్రెజెన్స్ - కొన్ని సీన్స్ లో యాక్టింగ్ తో ఆకట్టుకుంది. రోహిణి - సప్తగిరి తమ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తం మీద సాగతీత సన్నివేశాలతో ప్రేక్షకులను సహనాన్ని పరీక్షించిన 'అతిథి దేవోభవ'.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.
Tags:    

Similar News