ప్రభాస్‌తో సినిమాపై అనిల్ రావిపూడి ఏమన్నాడంటే
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి తర్వాత అపజయమెరగని డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి తర్వాత అపజయమెరగని డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. తన నుంచి ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా పటాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వరకు ప్రతీ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించినదే.
వెంకీ, అనిల్ కలయికలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 బ్లాక్ బస్టర్లు అయిన నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ముందు నుంచి ఎక్కువ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా పది రోజుల్లో రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుని ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
రిలీజైన రెండో వారంలో కూడా సంక్రాంతికి వస్తున్నాంకు మంచి ఆక్యుపెన్సీలు దక్కుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ సంబరం పేరిట ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్ర నటీనటులతో పాటూ స్థానిక రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
భారీ ఎత్తున జనాలు హాజరైన ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇంత భారీ హిట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమా సక్సెస్‌తో తన తర్వాతి సినిమాల విషయంలో టెన్షన్ పెరిగిందన్నాడు. తన సినిమాలు అన్ని చోట్లా బాగా ఆడితే గోదావరి జిల్లాల్లో ఇంకాస్త బాగా ఆడతాయని ఈ సందర్భంగా తెలిపాడు అనిల్.
ప్రపంచంలో సంతోషంగా, సరదాగా ఉండేవాళ్లంతా గోదావరి జిల్లాల్లోనే ఉంటారని, గోదారోళ్లంటేనే మర్యాదకు మారు పేరు అని అన్నాడు. ఈ క్రమంలో ఆడియన్స్ నుంచి ప్రభాస్ తో సినిమా ఎప్పుడనే ప్రశ్న అనిల్ కు ఎదురవగా, నేను కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నానని, మీరంతా గట్టిగా అనుకుంటే అయిపోతుందని అనిల్ రావిపూడి తెలిపాడు. మరి ప్రభాస్ ను డైరెక్ట్ చేయాలని అనిల్ చూస్తున్న ఎదురుచూపులకు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.
మారుతితో రాజా సాబ్, హను రాఘవపూడితో ఫౌజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆ రెండు సినిమాలు పూర్తి చేశాక సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయనున్న స్పిరిట్‌తో పాటూ సలార్2, కల్కి2ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్‌కు కామెడీ సినిమాలంటే ఇష్టమున్న నేపథ్యంలో మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ తో వెళ్తే ప్రభాస్ నో చెప్పే ఛాన్స్ లేదు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాలో నటించాలనే కోరికతో అనిల్ సందీప్ రెడ్డి వంగాను స్పిరిట్ లో చిన్న క్యారెక్టర్ అడిగాడని నెట్టింట వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే. వారం రెండు వారాల్లోపే దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది. అయితే ఆ అనౌన్స్‌మెంట్ ను వీడియో రూపంలో ఇవ్వనున్నట్లు ఇన్‌సైడ్ టాక్. మంచి ఎంటర్టైనింగ్ డైరెక్టర్ గా పేరున్న అనిల్ రావిపూడికి చిరంజీవిలోని కామెడీ టైమింగ్ తోడైతే కడుపుబ్బా నవ్వులు పండటం ఖాయం.