రోహిత్ ఒప్పుకోడనుకున్నా-అవసరాల

Update: 2016-08-22 07:47 GMT
జ్యో అచ్యుతానంద సినిమా చేయడానికి నారా రోహిత్ ఒప్పుకోడనుకున్నానని.. కానీ అదృష్టవశాత్తూ ఒప్పుకున్నాడని డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ అన్నాడు. ఈ కథ ముందు తాను చెప్పింది రోహిత్ కేనని అతను చెప్పాడు. ‘‘రోహిత్ గారిని కలిసి స్టోరీ వినిపించాను. మల్టీస్టారర్ కదా ఒప్పుకోరేమో అనిపించింది. రెండు రోజులు ఆలోచించి నిర్ణయం చెప్పమని అన్నాను. ఐతే ఆయన ఈ సినిమా చేస్తానన్నారు. ముందు ఈ మాట అన్నా.. రెండు రోజుల తర్వాత నో అంటారనుకున్నాను. కానీ లక్కీగా అలా చెప్పలేదు. ఇక నాగశౌర్య నాతో ‘ఊహలు గుసగుసలాడే’ చేశాడు కాబట్టే ఈ సినిమాకు ఎంచుకున్నానని అందరూ అనుకుంటారు. కానీ ఆనంద్ అనే పాత్ర రాస్తున్నపుడే అతడిదే ఈ పాత్ర అని ఫిక్సయ్యాను’’ అని అవసరాల చెప్పాడు.

ఇక టాలీవుడ్లో తన జర్నీ గురించి అవసరాల చెబుతూ.. ‘‘ఎనిమిదేళ్ల కిందట అష్టాచెమ్మాతో నా ప్రయాణం మొదలైంది. ఆ సమయంలో నాకు నలుగురు ముఖ్యమైన వ్యక్తులు పరిచయమయ్యారు. వాళ్లే నాని.. ఇంద్రగంటి మోహన కృష్ణ.. కళ్యాణ రమణ.. సాయి కొర్రపాటి. ఇంద్రగంటి గారికి నేనేదో వీడియో టేపు పంపిస్తే అమాయకంగా నాకు ఛాన్స్ ఇచ్చేశారు. నేను దర్శకుడు కావడం కోసం ప్రయత్నాలు చేసి ఫెయిలైనపుడు నాలో ఆత్మవిశ్వాసం నింపింది కళ్యాణ రమణ గారు. ఇక నన్ను దర్శకుడిగా పరిచయం చేసింది సాయిగారు. దర్శకుడిగా నా తొలి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’కు చాలా పేరొచ్చింది. ఆ సినిమా విడుదలై రెండు సంవత్సరాలైనా.. ఇప్పటికీ ఫేస్ బుక్ లో మెయిల్స్ వస్తుంటాయి. తన తండ్రి చనిపోయినపుడు ఆ బాధ నుంచి బయటికి రావడానికి నెల రోజులు ఈ సినిమానే చూస్తూ గడిపానని ఓ వ్యక్తి అన్నారు. ‘జ్యో అచ్యుతానంద’ కూడా మంచి కథ. పెద్ద కథ. ఈ సినిమా కూడా బాగుంటుంది. ప్రేక్షకులు ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నాడు.
Tags:    

Similar News