రూ.40కే మూవీ టికెట్ నార్త్‌కేనా సౌత్‌లో లేదా?

అయితే వైజాగ్, విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ఇంత త‌క్కువ ధ‌ర‌కు స్కైఫోర్స్ టికెట్ అందుబాటులో లేదు. క‌నీసం పీవీఆర్ ఐనాక్స్ లో అయినా అందుబాటులో లేదు.

Update: 2025-01-23 20:30 GMT

మ‌ల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమా చూడాలంటే ఐదుగురు స‌భ్యులున్న కుటుంబానికి కేవ‌లం టికెట్ల కోసం రూ.2000 సుమారు ఖ‌ర్చ‌వుతోంది. పాప్ కార్న్, కోక్ ఇత‌ర చిరు తిళ్ల రూపంలో మ‌రో రూ.1500 అద‌నం. 3000-4000 బ‌డ్జెట్ పెట్టాలంటే కేవ‌లం రూ.10,000- 15,000 మ‌ధ్య నెల‌వారీ ఆదాయం ఆర్జించే బ‌డుగు జీవుల‌కు వినోదం అందే ప‌రిస్థితి ఉందా? విశ్లేషిస్తే ఇది చాలా క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌. మెజారిటీ ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ థియేట‌ర్‌కి వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణాల్ని నిపుణులు విశ్లేషించ‌డం లేదు.

ఓటీటీలు హ‌వా సాగిస్తున్న ఈ రోజుల్లో థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసే జ‌నం త‌గ్గిపోయార‌ని బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్ స్వ‌యంగా చాలా స్ప‌ష్ఠంగా చెప్పారు. జ‌నం ఇంట్లోనే వినోదం అందుబాటులో ఉన్న‌ప్పుడు థియేట‌ర్ల‌కు ఎందుకు వ‌స్తారు? అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. అయినా ఇప్ప‌టికీ మ‌ల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గ‌లేదు. మ‌ల్టీప్లెక్సులో ఎగ్జిక్యూటివ్ సీట్ కి రూ.177-200 మ‌ధ్య చెల్లించాల్సి వ‌స్తే, రూ.300-400 మ‌ధ్య హై ఎండ్ టికెట్ కొనాల్సిన ప‌రిస్థితి ఇప్ప‌టీకి ఉంది. క‌నీసం అక్ష‌య్ న‌టించిన సినిమాకి కూడా ధ‌ర త‌గ్గ‌లేదు.

టికెట్ కోసం రూ.300 బ‌డ్జెట్ పెట్ట‌డానికి సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇప్పుడు సిద్ధంగా లేదు. ఎన్నో విశ్లేష‌ణ‌లు, అంచ‌నాల న‌డుమ 'స్కై ఫోర్స్' లాంటి సినిమా కోసం జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించడం అంత సులువేమీ కాద‌ని గ్ర‌హించింది అక్ష‌య్ కుమార్ బృందం. అత‌డు న‌టించిన తాజా చిత్రం 'స్కై ఫోర్స్'కి ర‌క‌ర‌కాల మార్గాల్లో ఆఫ‌ర్ల పేరుతో కేవ‌లం రూ.40కే పీవీఆర్ మ‌ల్టీప్లెక్స్ లో సినిమాని వీక్షించే వెసులుబాటు క‌ల్పించారు. అది కూడా జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే రోజున ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

అయితే వైజాగ్, విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ఇంత త‌క్కువ ధ‌ర‌కు స్కైఫోర్స్ టికెట్ అందుబాటులో లేదు. క‌నీసం పీవీఆర్ ఐనాక్స్ లో అయినా అందుబాటులో లేదు. దీంతో తెలుగు ప్రేక్ష‌కులు లేదా ద‌క్షిణాదిన‌ ఆఫ‌ర్ వ‌ర్తించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రుస్తోంది. 2024 జ‌న‌వ‌రిలో హృతిక్ న‌టించిన ఫైట‌ర్ ఇదే త‌ర‌హా క‌థాంశంతో విడుద‌లై ఫ్లాపైంది. కానీ ఇప్పుడు అక్ష‌య్ స్కై ఫోర్స్ కోసం ప్ర‌చారం ప‌రంగా, టికెట్ రేట్ల ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నందున నార్త్ లో ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్ల‌ను తెస్తుంద‌ని ఆశిస్తున్నారు. ద‌క్షిణాదిన దీనికి అంత‌గా ప్ర‌చారం లేదు. ప్రాంతీయ వెర్ష‌న్ల‌లో రిలీజ్ చేయ‌లేదు గ‌నుక ఇక్క‌డ సోసోగానే న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

స్కై ఫోర్స్ తొలి రోజు టాప్ చైన్లలో 12,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. నిర్మాత‌లు 'స్కై ఫోర్స్' కోసం బహుళ ప్రోమో కోడ్‌లను ప్రకటించ‌డంతో ఉత్త‌రాదిన ఇది ప్రేక్షకులను చాలావరకు ఆకర్షిస్తోంది. పింక్‌విల్లా ప్ర‌కారం.. స్కై ఫోర్స్ ప్రారంభ రోజు రూ. 7.50 కోట్ల నుండి రూ. 8.50 కోట్ల మధ్య వ‌సూలు చేస్తుంద‌ని అంచనా. ఈ చిత్రం ఈ సంఖ్యను అధిగమించి రెండంకెల ప్రారంభాన్ని పొందగలదా లేదా వేచి చూడాలి.

Tags:    

Similar News