హైదరాబాదీ యాక్టర్‌కు మంచి ఛాన్సే

Update: 2015-06-12 13:15 GMT
ఛార్మి నటించిన జ్యోతిలక్ష్మి ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వినిపించాయి. ఈ చిత్రంలో ఛార్మి నటన అమోఘం అంటూ ప్రశంసలొచ్చాయి. అంతేకాదు జ్యోతిలక్ష్మి  చేత అన్నా అని పిలిపించుకునే ఓ కుర్రాడు వేశ్య కొంపలో ఉంటాడు. అతడి నటనాభినయం విపరీతంగా ఆకట్టుకుంది.

సానికొంప గంగాభాయ్‌ కంపెనీలో అతడు కీలక ఉద్యోగి. ఎత్తుకొచ్చిన అమ్మాయిలంతా కొంప దాటి పారిపోకుండా కాపలా కాసే కర్కశుడు అతడు. కరుకైన గొంతు.. మెలి తిరిగిన కండలు.. భీకరమైన ఆకారంతో ఆకట్టుకున్న ఈ కుర్రాడు ద్వితీయార్థంలో విలన్‌పై జ్యోతిలక్ష్మి పగ ప్రతీకారం తీర్చుకోవడానికి సహాయపడతాడు. కరుకైన ఈ కుర్రాడెవరు అని అతడి గురించి వాకబు చేస్తే చాలా ఆసక్తికర సంగతులే తెలిశాయి. పేరు అజిజ్‌ నాజర్‌. ఇతడు ఆర్టిస్ట్‌ కం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. టాలీవుడ్‌లో చాలా సినిమాలకు తన కరుకైన గొంతును ఎరువిచ్చాడు. దూకుడులో సోనూసూద్‌కి గొంతు ఇచ్చింది కూడా ఇతగాడే. అంతేనా మరెన్నో పాత్రలకు గాత్రదానం చేశాడు ఈ కుర్రాడు.

ఇప్పుడు ఏకంగా పూరి సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు. కండలు పెంచి భీకరంగానే కనిపిస్తున్నాడు. మన క్రియేటివ్‌ డైరెక్టర్స్‌ అవకాశం ఇవ్వాలే గానీ, అతడిలోని ప్రతిభను సద్వినియోగం చేయాలే కానీ విలన్‌గా అతడికి బోలెడంత భవిష్యత్‌ ఉంది. అజీజ్‌ రాకతో వెతకబోయిన తీగ దొరికినట్టే. ఛాన్సులిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News