బాహుబలి-2.. డబుల్ సెంచరీ ఆశల్లేవ్

Update: 2017-06-06 07:39 GMT
తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రభంజనం ఎలా సాగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న ‘బాహుబలి: ది బిగినింగ్’ సాధించిన వసూళ్ల కంటే ప్రతి రోజూ 50 శాతం అధికంగానే వసూలు చేస్తూనే సాగిందీ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ ఫుల్ రన్ షేర్ రూ.150 కోట్లు దాటుతుందని ముందు అంచనా వేయగా.. ఆ అంచనాల్ని దాటి దూసుకెళ్లిందీ సినిమా. పది రోజుల్లోనే రూ.175 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ 3.. 4 వీకెండ్లలోనూ మంచి వసూళ్లు సాధించింది. కానీ ఆ తర్వాత మాత్రం బాహుబలి-2 బండి అనుకున్నట్లుగా నడవట్లేదు.

ఓ దశలో ఈ సినిమా జోరు చూసి తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్ల షేర్ పక్కా అని అంచనా వేశారు. కానీ గత రెండు వారాల నుంచి బాహుబలి-2 అతి కష్టం మీద నడుస్తోంది. చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదు. దీంతో రూ.190 కోట్ల మార్కు దాటాక.. బండి ముందుకు సాగట్లేదు. ఆరో వీకెండ్ అయ్యాక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.192.9 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటిదాకా దాదాపుగా థియేట్రికల్ రన్ పూర్తయినట్లే ఉంది. థియేటర్లు బాగా తగ్గిపోయాయి. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వచ్చాక బాహుబలి-2 కలెక్షన్లకు బాగానే గండి పడింది. ఇప్పుడున్న వేగంతో రూ.200 కోట్ల షేర్ మార్కును అందుకోవడం మాత్రం కష్టమే. ఫుల్ రన్లో షేర్ రూ.195 కోట్ల మార్కు దగ్గర ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా చాలా పెద్ద ఫిగరే అయినప్పటికీ.. రౌండ్ ఫిగర్ అయితే బాగుండేదన్నది బాహుబలి అభిమానుల ఆశ.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News