బాహుబలి2 ఖాతాలో ఎన్ని రికార్డులో

Update: 2017-05-27 05:46 GMT
బాహుబలి ది కంక్లూజన్.. ఇప్పుడు కొంచెం వసూళ్ల స్పీడ్ తగ్గినా ఈ సినిమా సాధించిన ఘన విజయాన్ని.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చూపించిన రూట్ ను.. ఓపెన్ చేసిన కొత్త మార్కెట్లను మర్చిపోవడం అసాధ్యమైన విషయం. భారతీయ సినిమా సత్తా చాటిన బాహుబలి ఖాతాలో అరుదైన రికార్డులు ఎన్నో చోటు చేసుకున్నాయి.

ఇప్పుడీ సినిమా దేశవ్యాప్తంగా అనేక రికార్డులను నమోదు చేసింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి నాలుగు వారాలకు గాను ఏపీ తెలంగాణల్లో 292 కోట్ల గ్రాస్.. 262.9 కోట్ల నెట్.. 187.4 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది బాహుబలి 2. కేవలం ఇండియాలోనే ఇప్పటివరకూ 1000.3 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించడం అసామాన్యమైన విషయం. ఇప్పటివరకూ కనీసం దేశంలో 400 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించిన మూవీ కూడా లేదంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇక దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు 1279.8 కోట్ల రూపాయలు అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన గ్రాస్ వసూళ్లు 1557.5 కోట్లు.

ఇవన్నీ వసూళ్ల లెక్కలైతే.. రికార్డుల లిస్ట్ చాలానే ఉంది. ప్రస్తుతం రెండో అతి పెద్ద ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది బాహుబలి. కొన్ని రోజుల క్రితం వరకూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది కానీ.. చైనాలో ఆమిర్ ఖాన్ దంగల్ అసాధారణమైన వసూళ్లు సాధించి తొలి స్థానానికి దూసుకుపోయింది. అలాగే.. కేవలం హిందీ వరకూ తీసుకుంటే.. ఇండియాలో అతి పెద్ద బ్లాక్ బస్టర్. దేశీయ వసూళ్లలో ఇప్పటివరకూ ఏ హిందీ చిత్రం 400 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ను అందుకోలేదు. కానీ బాహుబలి మాత్రం 500 కోట్ల రికార్డ్ దిశగా దూసుకుపోతోంది.

టాలీవుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేరళలో మినహాయిస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అత్యధిక వసూళ్లను సాధించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి2. తమిళ్ చిత్రాల్లో కూడా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా ఇదే. కేరళలో మాత్రం రెండో అతి పెద్ద సినిమాగా నిలిచింది. దేశంలో 1000 కోట్ల రూపాయల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను సాధించిన తొలి చిత్రం బాహుబలి2. ఇక 800 కోట్ల నుంచి.. 1500 కోట్ల రూపాయల క్లబ్ వరకూ.. అన్ని ఒక ఇండియన్ మూవీ గ్రాస్ వసూళ్లను ఓపెన్ చేసిన మూవీ బాహుబలి ది కంక్లూజన్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News