బాహుబలి-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు

Update: 2017-04-22 11:23 GMT
ఎట్టకేలకు బాహుబలి-2 విడుదలకు మార్గం సుగమమైంది. అన్ని ఏరియాల్లోనూ అనుకున్న ప్రకారం ఏప్రిల్ 28న ఈ చిత్రం సజావుగా విడుదల కాబోతున్నట్లే. కొన్ని రోజుల కిందట తమిళనాడు.. కర్ణాటకల్లో ఈ సినిమా విడుదలపై అనుమానాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు సమస్య త్వరగానే తీరిపోగా.. కర్ణాటకలో తలెత్తిన వివాదం అంతకంతకూ పెద్దదవడం.. అక్కడి కన్నడ సంఘాలు బాహుబలి-2 విడుదలను వ్యతిరేకిస్తూ బంద్ కు కూడా పిలుపునివ్వడం తెలిసిందే. ఐతే రాజమౌళి విడుదలకు సహకరించాలని అభ్యర్థించడం.. అదే సమయంలో సత్యరాజ్ పట్టు వీడి క్షమాపణ చెప్పడంతో సమస్య పరిష్కారం అయిపోయింది.

బాహుబలి-2 విడుదలను అడ్డుకోబోమంటూ ఇన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంఘాలు మీడియాకు స్పష్టం చేశాయి. ‘ది కంక్లూజన్’ విడుదలకు వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులూ ఉండబోవని స్పష్టం చేయడంతో.. చకచకా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాడు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్. ఆ రాష్ట్రానికి ‘బాహుబలి-2’ హక్కుల్ని రూ.40 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్న బయ్యర్.. రెండు నెలలుగా మానసిక వేదన అనుభవిస్తున్నాడు. తెలుగు సినిమాలకు మామూలుగానే కర్ణాటకలో మంచి మార్కెట్ ఉండగా.. ‘బాహుబలి-2’ లాంటి  మెగా మూవీపై అక్కడ అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా కనీసం అక్కడ యాభై కోట్ల షేర్ అయినా సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News