బాహుబలి ఎఫెక్ట్ కిక్-2 మీదా ఉంది

Update: 2015-08-20 12:09 GMT
బాహుబలి ఓ చరిత్ర. అది ఏ స్థాయిలో చరిత్ర సృష్టించిందంటే.. తెలుగు సినిమాను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని విభజించి చూస్తున్నారిప్పుడు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు బాహుబలి ప్రభావం తర్వాత వచ్చే తెలుగు సినిమాలపై చాలా నెగెటివ్ గా ఉంటుందన్నాడు. కానీ వాస్తవానికి బాహుబలి వల్ల తర్వాత వచ్చే సినిమాలకు మేలు జరుగుతోంది తప్ప చెడు కాదు. తెలుగు సినిమా మార్కెట్ ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది బాహుబలి. ఐతే ప్రతి సినిమా ఆ స్థాయిని అందుకోలేకపోవచ్చు కానీ.. వాటి వాటి స్థాయిలో మార్కెట్ ను, ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి ఇప్పడొస్తున్న సినిమాలు. శ్రీమంతుడు బాహుబలి కంటే ముందు వచ్చి ఉంటే ఇలా పది రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరే ఛాన్సే లేదని కచ్చితంగా చెప్పొచ్చు. మహేష్ కెరీర్ లోనే ‘శ్రీమంతుడు’కి అత్యధిక బిజినెస్  జరిగి, అత్యధిక వసూళ్లు రావడానికి ‘బాహుబలి’ కూడా ఓ రకంగా కారణమే.

ఇక శ్రీమంతుడు తర్వాత వస్తున్న ‘కిక్-2’ మీద కూడా బాహుబలి  ఎఫెక్ట్ పాజిటివ్ గానే ఉంది. బిజినెస్ వ్యవహారాలు ముందే ముగిసిపోయాయి కాబట్టి ఆ విషయంలో ఎఫెక్ట్ ఎంత అన్నది పక్కనబెట్టేస్తే.. రవితేజ కెరీర్ లోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజవుతోంది. ఓపెనింగ్స్ కూడా భారీగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. కర్ణాటక లాంటి పరాయి రాష్ట్రంలో రవితేజ సినిమా వందకు పైగా థియేటర్లలో విడుదలవుతోంది. గతంలో అయితే రవితేజ సినిమాలకు 50-60 థియేటర్లలో రిలీజైతే ఎక్కువ. ఇక  తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో సైతం రవితేజ కెరీర్ రికార్డును బ్రేక్ చేస్తూ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో రవితేజ సినిమాలకు 8.45 షోలు రెండో మూడో పడేవి. ఇప్పుడు ఐదు షోలు వేస్తున్నారు. రవితేజ సినిమాలకు ఎప్పుడూ బెనిఫిట్ షోలు వేసింది లేదు. కానీ కిక్-2కి వేస్తున్నారు. ఈ హంగామా అంతా చూస్తుంటే రవితేజ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కిక్-2కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News