ఒక సినిమా హిట్టయిందంటే చాలు. ఆ సినిమాని రకరకాలుగా వాడుకొంటుంటారు. ముఖ్యంగా అందులోని సన్నివేశాలు రెండు మూడు రోజుల్లోనే స్పూఫ్ లు గా మారుతుంటాయి. ఔత్సాహికులు ఎవరి శైలి లో వాళ్లు ఆ సన్నివేశాలకి స్పూఫ్ తయారు చేసి ఇంటర్నెట్ లో పెడుతూ ఆనందిస్తుంటారు. మరికొంతమంది తమ సినిమాల ప్రమోషన్ల కు వాడుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇప్పుడు బాహుబలి కూడా అలాగే ఉపయోగపడుతోంది. బాహుబలి లో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకొన్నట్టుగానే ఇప్పుడు గణేష్ విగ్రహాలు తయారవుతున్నాయి. రాబోయే వినాయక చవితిలో బాహుబలి వినాయకులు బోలెడంతమంది కనిపిస్తారన్నమాట. రమ్యకృష్ణ చిన్నబాబుని ఒంటిచేత్తో లేపి పట్టుకొన్నట్టుగానే పుష్కరాల్లో కొద్దిమంది అలా చిన్నపిల్లల్ని ఒంటిచేత్తో పట్టుకొని ఫొటోలు దిగడం కనిపించింది. ఇప్పుడు సినిమా ప్రమోషన్ల లోనూ `బాహుబలి` కనిపిస్తున్నాడు. ‘డిమోంటే కాలనీ’ మూవీ నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్ కోసం ‘బాహుబలి’ థీమ్ ని, ‘రాఖీ’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ని స్పూఫు గా చేసి వాడుకున్నారు. ‘బాహుబలి’ సాధించిన కలెక్షన్ల ను ఇందులో హైలైట్ చేశారు. అఫ్ట్రాల్ బాహుబలి కలెక్షన్లేంటి సార్.. అంటూ ఎన్టీఆర్ `బాహుబలి` లెక్కలు చెబుతున్నట్టుగా ఆకట్టుకొనేలా ఉంది ఆ స్పూఫ్.