నాని మాట్లాడాల్సిందేనంటున్న బాబు గోగినేని!

Update: 2019-03-10 10:56 GMT
బిగ్ బాస్ మొదట తెలుగులో మొదలు పెట్టే సమయంలో అసలు ఇలాంటి రియాలిటీ షోలు తెలుగులో క్లిక్ అవుతాయా అనే అభిప్రాయాలు వినిపించాయి.  కానీ ఆలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది.   ఇక బిగ్ బాస్ సీజన్ 2  విషయంలో వివాదాలు ప్రముఖ పాత్ర పోషించాయి. అయినా ఓవరాల్ గా సీజన్ 2 కూడా క్లిక్ అయింది.  హోస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ బిగ్ బాస్ మరింతగా ప్రజల్లోకి వెళ్ళింది.

బిగ్ బాస్ సీజన్ 2 జరిగినన్ని రోజులు ఎంత హంగామా జరిగిందో పూర్తయిన తర్వాత ఇంకా అలాంటి హంగామానే కొనసాగుతోంది.  బిగ్ బాస్ 2 విజేత కౌశల్ ను కౌశల్ ఆర్మీ సభ్యులే కొందరు విమర్శించడం.. ఆ డిబేట్లు కొన్ని టీవీ ఛానల్స్ లో ఈమధ్య ప్రసారం చేయడం తెలిసిన విషయాలే.  బిగ్ బాస్ 2  జరిగిన సమయంలో కౌశల్ టీమ్ ఓటింగ్ ను ప్రభావితం చేశారని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు.  ఈ విషయంపై బిగ్ బాస్ 2 లో ఒక కంటెస్టెంట్ అయిన బాబు గోగినేని మాట్లాడుతూ ఓటింగ్ లో అవకతవకలపై ఇప్పుడు కొన్ని ఋజువులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిపై నాని స్పందించాలని అభిప్రాయపడ్డారు.

బిగ్ బాస్ 2 జరిగినే సమయంలో బాబు గోగినేనికి 'గేమ్ ను గేమ్ లాగా ఆడాలి' అని నాని క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. అప్పట్లో గోగినేని ఆ విషయంపై నానితో వాదించాడు కూడా. అంతే కాదు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ ఓటింగ్ సరళిపై సందేహాలు వ్యక్తం చేశాడు.  మరి ఇప్పుడు కౌశల్ ఓట్ల గేమ్ పై స్పందించాలి అంటున్నాడు. మరి నాని నిజంగానే స్పందిస్తాడా.. లేదా ఎందుకొచ్చిన తంటా అని కిమ్మనకుండా ఉంటాడా అనేది వేచి చూడాలి.
    
    
    

Tags:    

Similar News