బాలయ్య మళ్లీ అక్కడికే వెళ్తున్నాడు

Update: 2016-04-07 07:04 GMT
నందమూరి బాలకృష్ణకు అమరావతి మీద ప్రేమ మరీ ఎక్కువైపోతున్నట్లుంది. ఆల్రెడీ ‘డిక్టేటర్’ ఆడియో వేడుకను అక్కడే అంగరంగ వైభవంగా చేయించాడు. మరోవైపు నారా రోహిత్ - నందమూరి తారకరత్న కలిసి నటించిన ‘రాజా చెయ్యి వేస్తే’ ఆడియో వేడుకను కూడా అమరావతి సమీపంలోనే జరిగింది. దానికి బాలయ్య అతిథిగా వచ్చాడు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన తన వందో సినిమాకు కూడా అమరావతిలోనే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాడట బాలయ్య. అమరావతిలోని బుద్ధ విగ్రహం దగ్గర బాలయ్య వందో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే వేదికను కూడా నిర్మించారట.

ఉగాది పర్వదినం సందర్భంగా తన వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని లాంఛనంగా మొదలుపెట్టబోతున్నాడు బాలయ్య. ఈ వేడుకకు బాలయ్య వియ్యంకుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఓ చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ సొంత నిర్మాణ సంస్థ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రారంభోత్సవం జరిపాక మరికొన్ని రోజులు స్క్రిప్టు మీద పని చేసి మేలో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌ తో (దాదాపు రూ.60 కోట్లని సమాచారం) ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News