నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందో సినిమాని అఫీషియల్ గా ప్రకటించేందుకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. క్రిష్ డైరెక్షన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేయనున్న బాలయ్య.. అదే విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. శాతవాహన రాజుల్లో ఆఖరి చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవితాన్ని.. చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కించనున్నాడు క్రిష్.
మరి ఇలాంటి హిస్టరీ బేస్డ్ సినిమాలకు లొకేషన్స్ అత్యంత ప్రాధాన్యం. వందల ఏళ్ల క్రితం చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను ఇప్పుడు తిరిగి సృష్టించాల్సి వస్తుంది. అంటే సెట్టింగ్స్ కే బోలెడంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే లొకేషన్స్ కూడా చరిత్ర ఆనవాళ్లను ప్రతిబింబించాలి. అందుకే గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని మొరాకోలో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. సినిమాలోని యుద్ధ సన్నివేశాల్లో చాలా భాగం మొరాకోలోనే చిత్రీకరించనున్నారు. ఇక్కడి వాతావరణ, భూపరిస్థితులు హిస్టరీకి ప్రతిబింబంలా కనిపిస్తాయని తెలుస్తోంది.
గతంలో బాలీవుడ్ మూవీ ఫాంటమ్ కి కూడా.. ప్రధాన సన్నివేశాలను మొరాకోలోనే చిత్రీకరించారు. గౌతమీపుత్ర శాతకర్ణిపై చారిత్రాత్మక చిత్రాన్ని తన వందో సినిమాగా తీసి చరిత్ర సృష్టించేందుకు బాలయ్య సిద్ధమైపోతున్నారు. ఈ మూవీలో రాజమాత గౌతమిగా బాలీవుడ్ నటి హేమమాలినిని తీసుకునేందుకు క్రిష్ ప్రయత్నిస్తున్నాడు.