ఇఫీ ముగింపు ఉత్స‌వంలో ఇద్ద‌రు సీనియ‌ర్లు!

Update: 2022-11-28 14:30 GMT
టాలీవుడ్ సీనియ‌ర్‌ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌లకున్న ప్ర‌త్యేక‌త‌, వారి స్టార్ డ‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో వున్న సీనియ‌ర్ హీరోల్లో ముందు వ‌రుస‌లో నిలిచిన ఈ ఇద్ద‌రు హీరోలు ప్ర‌స్తుతం గోవాలో జ‌రుగుతున్న 53వ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వం (ఇఫీ)లో పాల్గొంటున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ త‌ను న‌టించిన `అఖండ‌` మూవీ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న కోసం ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీ‌ను, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డితో క‌లిసి ఇప్ప‌టికే గోవాకు వెళ్లారు.

ప్ర‌స్తుతం అక్క‌డే వున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి `ఇండియ‌న్ ఫిలిం ప‌ర్స‌నాలిటీ అఫ్ ది ఇయ‌ర్ 2022` పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వేడుక‌ల్లోనే చిరుకు ఈ అవార్డుని అంద‌జేయ‌నున్నారు.

ఇందు కోసం చిరంజీవి త‌న స‌తీమ‌ణి సురేఖ‌తో క‌లిసి సోమ‌వారం గోవాకు వెళ్లారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ అఫ్ ఇండియా (ఇఫీ) ముగింపు ఉల్స‌వాలు సోమ‌వారం మొద‌ల‌య్యాయి. అందులో భాంగానే మెగాస్టార్ చిరంజీవి `ఇండియ‌న్ ఫిలిం ప‌ర్స‌నాలిటీ అఫ్ ది ఇయ‌ర్ 2022` పుర‌స్కారాన్ని అందుకోవ‌డానికి స‌తీస‌మేతంగా గోవా వెళ్ల‌డం విశేషం.

ఇదిలా వుంటే 2023 సంక్రాంతికి సై అంటే సై అంటూ సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌ పోటీకి దిగ‌బోతున్న విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం న‌టిస్తున్న మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా చిరుకు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తోంది.

ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇక ఇదే టైమ్ లో బాల‌కృష్ణ న‌టిస్తున్న `వీర సింహారెడ్డి` బ‌రిలో దిగ‌బోతోంది. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారే నిర్మిస్తుండ‌టం విశేషం. ఇందులోనూ హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఒకే నిర్మాణ సంస్థ‌, ఒకే హీరోయిన్ తో  మెగాస్టార్ వ‌ర్సెస్ బాల‌కృష్ణ‌గా ఈ సంక్రాంతి స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌బోతోంది.  ఈ నేప‌థ్యంలో గోవాలో ఒకే వేదిక‌పై క‌లుస్తున్న చిరు, బాల‌య్య‌ల మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ రాబోతోంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News