జైసింహా.. మహారాష్ట్రలో వంద రోజులాడిందా?

Update: 2018-04-22 08:30 GMT
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘జై సింహా’ సంక్రాంతికి విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఆ చిత్రం మంచి వసూళ్లే సాధించింది. భారీ అంచనాలతో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం దీనికి బాగా కలిసొచ్చింది. మిగతా సినిమాలూ అంతంతమాత్రమే కావడంతో ఏ చెట్టూ లేనప్పుడు అన్న తరహాలో.. ఈ చిత్రమే ప్రేక్షకులకు ఆప్షన్ అయింది. దీంతో ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. ఐతే ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా రెండు మూడు వారాల తర్వాత అడ్రస్ లేకుండా పోతున్న ఈ రోజుల్లో ఈ చిత్రం నాలుగు కేంద్రాల్లో శత దినోత్సవం పూర్తి చేసుకుందట.

బాలయ్య ప్రతి సినిమానూ వంద రోజులు ఆడించేసే ఎమ్మిగనూరుతో పాటు చిలకలూరిపేటలోని ఓ థియేటర్లోనూ ‘జై సింహా’ వంద రోజులు ఆడిందట. అలాగే ‘లెజెండ్’ సినిమాను వెయ్యి రోజులకు పైగా ఆడించిన ప్రొద్దుటూరులో షిఫ్టింగ్‌ తో 100 రోజులు ఆడించారట. ఐతే ఏపీలో బాలయ్య సినిమా వంద రోజులాడటంలో ఆశ్చర్యం లేదు. బాలయ్య సినిమాలు అన్నేసి రోజులు ఆడుతున్నాయా.. ఆడిస్తున్నారా అన్నది అందరికీ తెలిసిందే. ఐతే ‘జై సింహా’ మహారాష్ట్రలోనూ ఒక థియేటర్లో వంద రోజులు ఆడిందట. షోలాపూర్‌ లోని లక్ష్మీనారాయణ అనే థియేటర్లో ఈ చిత్రం వంద రోజులు ఆడినట్లుగా 100 డేస్ పోస్టర్ మీద వేశారు. అక్కడ నాలుగు వారాల పాటు నాలుగు షోలు ఆడించి.. ఆ తర్వాత డైలీ ఒక షోతో వంద రోజులు రన్ చేశారట. ఐతే తెలుగు రాష్ట్రాల్లోనే రెండు మూడు వారాల తర్వాత జనాలు థియేటర్లకు రావడం కష్టంగా ఉంటే.. ‘జై సింహా’ లాంటి సినిమా కోసం మహారాష్ట్రలో జనాలు వంద రోజుల పాటు (ఒక షో అయినా సరే) థియేటరుకు రావడం నమ్మశక్యం కాని విషయమే. ఇందులో మతలబు ఏంటో మరి?
Tags:    

Similar News