యాపారం యాపారమే.. పేకాట పేకాటే.. బాలయ్యను చూసి నేర్చుకోవాల్సిందే

Update: 2021-10-15 11:30 GMT
ఎక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర కాదన్న సామెతకు నిలువెత్తు రూపంలా కనిపిస్తున్నారు నందమూరి బాలక్రిష్ణ. తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు తన కుమారుడు కమ్ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును వెంట పెట్టుకొని బాలయ్య ఇంటికి రావటం.. ఆయన్ను కలవటం తెలిసిందే. ఎన్నికల్లో తమకు సహకరించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన సందర్భంలో ‘బాలక్రిష్ణ మంచి మనిషి. ఆయన అల్లుడు లోకేశ్ మంగళగిరి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మేం వ్యతిరేకంగా పని చేశాం. కానీ.. అదేమీ మనసులో పెట్టుకోకుండా మంచు విష్ణు గెలిచేందుకు సహకరించారు’ అంటూ బాలయ్య గొప్పతనాన్ని వెల్లడించటం చాలామందిని విస్తుపోయేలా చేసింది.

సినిమాల్లోనే కాదు రియల్ జీవితంలోనూ ఎలాంటి ట్విస్టులు ఉంటాయన్న విషయం తాజాగా మోహన్ బాబు - బాలయ్య విషయంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇదంతా ఉదయం జరిగితే.. సాయంత్రానికి మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ (మై హోం రామేశ్వరరావుది కూడా) ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద కొత్తగా షురూ కానున్న కార్యక్రమం అన్ స్టాపబుల్. సినీ తారలు ఇంటర్వ్యూలు చేయటం కొత్తేం కాదు.కానీ.. ఇలాంటి వాటికి దూరంగా ఉండే బాలక్రిష్ణ అందుకు భిన్నంగా.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద యాంకర్ పని చేయటం.. తోటి సినీ తారల్ని ఇంటర్వ్యూ చేసేందుకుఓకే చెప్పిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

'మ‌నిషి ప్రజెంటేష‌నే అన్‌స్టాప‌బుల్‌. న‌వ్వ‌డం, న‌వ్వించ‌డ‌మే యాక్టింగ్ కాదు, పాత్ర‌లోకి ప్ర‌వేశించ‌డం. అది ఎంతో ఒత్తిడితో కూడుకుంది. ఇక ప్ర‌తి ఇండ‌స్ట్రీలో పోటీ ఉంటుంది. పోటీ ఉన్న‌ప్పుడే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. బావిలో క‌ప్ప‌లా ఉండ‌కుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడే అస‌లు మ‌నిషి ఆవిష్క‌రించ‌బ‌డ‌తాడు. అలా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మే అన్‌స్టాప‌బుల్‌. ప్ర‌తి మ‌నిషికీ జీవితంలో ఒక ప్ర‌యాణం ఉంటుంది. వాటిని అధిగ‌మించి ల‌క్ష్యాన్ని చేర‌డ‌మే అన్‌స్టాప‌బుల్‌. ఇది నాకు న‌చ్చింది. అందుకే ఒప్పుకున్నా. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చే న‌టీన‌టుల‌తో క‌లిసి మాట్లాడ‌తా. మాట‌ల‌తో వాళ్ల‌ను ట్విస్ట్ చేస్తా. ఆహాలో అన్‌స్టాప‌బుల్‌లో క‌లుద్దాం' అంటూ బాలయ్య మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. నవంబరు నాలుగు నుంచి ఈ ప్రోగ్రాం ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఇదంతా చూసినప్పుడు యాపారం యాపారమే.. పేకాట పేకాటే అన్న భావన కలుగక మానదు. ఏమైనా.. రెండు విషయాలు ఒకేరోజు బయటకు రావటం కాకతాళీయమేనని చెప్పక తప్పదు.




Tags:    

Similar News