మహేష్ టీం మారట్లేదుగా..

Update: 2018-04-28 04:30 GMT
మహేష్ బాబుకు చాలా కాలం తర్వాత ఉపశమనాన్నిచ్చింది ‘భరత్ అనే నేను’. ఈ చిత్రం మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయ్యే దిశగా అడుగులు వేస్తోంది. తొలి వారంలో ‘భరత్ అనే నేను’ రూ.75 కోట్ల దాకా షేర్.. రూ.120 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇది ట్రేడ్ పండిట్లు చెబుతున్న మాట. బాక్సాఫీస్ సైట్లలో కూడా గణాంకాలు కొంచెం అటు ఇటుగా ఈ ఫిగర్లకు దగ్గరగా ఉన్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం ‘భరత్ అనే నేను’ తొలి వారంలో రూ.161.28 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా పోస్టర్లు వదిలేసింది. ఐతే షేర్ వివరాలు మాత్రం చెప్పట్లేదు.

ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటన ఇచ్చారు ఇంతకుముందు. ఆ ప్రపోర్షన్లోనే ఇప్పుడు కొత్త లెక్కలు ఇస్తున్నట్లుగా ఉంది. ఓవైపు మూడు వారాల తర్వాత రూ.110 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ‘రంగస్థలం’ రూ.180 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్లుగా ఆ చిత్ర బృందం పోస్టర్లు వదులుతుంటే.. ‘భరత్ అనే నేను’ టీం మాత్రం వారానికే రూ.161 కోట్లకు పైగా గ్రాస్ అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. అసలు ఈ చిత్ర షేర్ల వివరాలను చిత్ర బృందం మొదట్నుంచి బయటపెట్టడానికి అంత సుముఖంగా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి.. మంచి వసూళ్లు సాధిస్తున్నపుడు ఫెయిర్‌ గా ఉంటే బాగుంటుంది కదా? మరి ఎందుకో ఈ తిరకాసు? ఈ విషయంలో మహేష్ వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న పీఆర్ టీం వైపే వేళ్లూ చూపిస్తున్నారు జనాలు.
Tags:    

Similar News