కామ్రేడ్‌ డైరెక్టర్‌ సినిమా కష్టాలు అన్నీఇన్నీ కావట!

Update: 2019-07-25 17:30 GMT
మరి కొన్ని గంటల్లో 'డియర్‌ కామ్రేడ్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించడంతో ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండి భారీగా ఉన్నాయి. ఇక టీజర్‌ మరియు ట్రైలర్‌ విడుదల తర్వాత దర్శకుడు భరత్‌ కమ్మ మంచి కంటెంట్‌ తో సినిమా తీసినట్లుగా అనిపిస్తుంది. మొదటి సినిమాతోనే దర్శకుడు భరత్‌ కమ్మ ఇంత క్రేజ్‌ ను దక్కించుకున్నాడు. విజయ్‌ దేవరకొండ మరియు మైత్రి మూవీస్‌ బ్యానర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్‌ అని చెప్పాలి. ఇలాంటి కాంబోకు భరత్‌ దర్శకత్వం వహించడంతో ఆయన పేరు కూడా మారుమ్రోగిపోతుంది.

మొదటి సినిమాకే ఇంత క్రేజ్‌ ను తెచ్చుకున్నాడంటూ భరత్‌ కమ్మపై అంతా ప్రశంసలు కురిపిస్తుంటే ఆయన ఈ ప్రశంసలు దక్కించుకునేందుకు ఏకంగా 12 ఏళ్లు కష్టపడ్డానంటూ తాజాగా వైజాగ్‌ లో జరిగిన ప్రమోషనల్‌ వేడుకలో చెప్పుకొచ్చాడు. ఎంఎస్‌ చేసేందుకు యూఎస్‌ ఆఫర్‌ వచ్చినా దాన్ని కాదనుకుని సినిమాల్లోకి వచ్చాను. నాలుగు అయిదు సంవత్సరాలు ప్రయత్నించాలనుకున్నాను. కాని ఏకంగా 12 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చింది.

ఈ సినిమా మూడేళ్ల క్రితం ఓకే అయ్యింది. ఆ సమయంలో మానాన్న చాలా సంతోషించారు. కాని ఆయన సినిమా చూడకుండానే చనిపోయారు. సినిమా చిత్రీకరణ సగంలో ఉండగా ఆయన మృతి చెందారు. ఆయనకు నా మొదటి సినిమాను చూపించలేక పోయాను అనే బాధ నాకు జీవితాంతం ఉంటుంది. నాన్న మృతి చెందిన తర్వాత షూటింగ్‌ సమయంలో అప్పుడప్పుడు కార్‌ వాన్‌ లోకి వెళ్లి ఏడ్చిన సందర్బాలు ఉన్నాయంటూ ఎమోషనల్‌ గా తన సినిమా కష్టాలను చెప్పాడు. ఈ చిత్రం సక్సెస్‌ అయితే భరత్‌ కమ్మ క్రేజ్‌ అమాంతం పెరగడం ఖాయం. ఆయనతో స్టార్‌ హీరోలు సైతం చేసేందుకు ముందుకు రావచ్చు. ఇండస్ట్రీలో కష్టపడితే ఎప్పటికో ఒకప్పటికి గుర్తింపు వస్తుందని భరత్‌ కమ్మ మరోసారి నిరూపించారు.
Tags:    

Similar News