ఏపీ ఎన్నికల్లో వివాదాస్పద బిగ్‌ బాస్‌ స్టార్‌

Update: 2019-03-29 09:08 GMT
బిగ్‌ బాస్‌ రెండవ సీజన్‌ లో సామాన్యుల కోటాలో రీ ఎంట్రీ ఇచ్చిన వారిలో సంజన ఒకరు. హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజే ఆమె రచ్చ రచ్చ చేసింది. తాను సామాన్యురాలిగా వచ్చినా సెలబ్రెటీలకు ఏమాత్రం తక్కువ కాను అంటూ మొదటి వారమే తన సత్తా చూపేందుకు ప్రయత్నించింది. ఆమె చేసిన హడావుడి కారణంగా మొదటి వారంలోనే సంజన హౌస్‌ నుండి బయటకు వెళ్లి పోయింది. బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన తర్వాత కూడా సంజన పలు మీడియా సమావేశాల్లో - ఇంటర్వ్యూల్లో షాకింగ్‌ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నాని యాంకరింగ్‌ పై విమర్శలు చేసి సోషల్‌ మీడియాలో సందడి చేసింది.

బిగ్‌ బాస్‌ అయిన తర్వాత ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సంజన ఆ తర్వాత వార్తల్లో లేకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు సంజన ఏపీలో ఎన్నికల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చింది. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నూజువీడు నుండి అసెంబ్లీ అభ్యర్థిగా సంజన పోటీ చేసింది. కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు ఈమె ప్రయత్నించింది. అయితే అక్కడ సీటు మరొకరికి ఇవ్వడంతో సంజన స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసింది.

తనకున్న గ్లామర్‌ - గుర్తింపుతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని ఆరిగిపల్లి మండలం కృష్ణవరం గ్రామంకు చెందిన ఒక రైతు కుమార్తె సంజన. రాజకీయాల్లో సంజన తండ్రి ధన కోటేశ్వరరావు రాణించేందుకు ప్రయత్నించినా ఆయన విఫలం అయ్యాడు. అయితే ఆయన కూతురుగా సంజన ఇప్పుడు రాజకీయాలు చేసేందుకు సిద్దం అయ్యింది. సంజన గెలుపు ఓటముల గురించి ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News