ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్ గా మంచి గుర్తింపు వస్తుంది. అదే బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఆ డైరెక్టర్ పేరు మార్మోగిపోతుంది. అదే మొదటి సినిమాకే ఈ రేంజ్ హిట్ అంటే.. దాదాపుగా ఎవరెస్ట్ ఎక్కినట్టే. కానీ అదే డైరెక్టర్ రెండో సినిమా డిజాస్టర్ తీస్తే... నిర్మాత అప్పులపాలయ్యే వీధినపడేంత పరిస్థితి వస్తే... ఆ డైరెక్టర్ అమాంతంగా పాతాళంలోకి జారిపోయినట్టే.
ఈ రెండూ బొమ్మరిల్లు భాస్కర్ కు అనుభవమే. అతడు మొదటి సినిమా బొమ్మరిల్లు అతడికి వచ్చిన పాపులారిటీ మొత్తం రెండో సినిమా ఆరెంజ్ తో ఊడ్చుకుపోయింది. ఆరెంజ్ సినిమా దెబ్బకు ఇన్నేళ్లగా అతడికి ఇంకో అవకాశమే దక్కలేదు. కథలు సిద్ధం చేసి వినిపించడమే తప్ప ఓకే చెప్పే హీరో లేకుండా పోయాడు. చివరకు గోపీచంద్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ కూడా సిద్ధం చేశాడట. ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారని.. గోపీచంద్ ఓకే అంటే సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ చాలాకాలంగా టాప్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ - సురేష్ బాబులతో టచ్ లోనే ఉన్నాడు. వెంకటేష్ తో సినిమా తీయడానికి స్టోరీ రెడీ చేసుకున్నా డేట్స్ దొరకలేదు. దీంతో ఇప్పుడు మనసు మార్చుకుని గోపీచంద్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కూడా తనకు ఓ బ్రేక్ ఇచ్చే దర్శకుడి కోసం చూస్తున్నాడు. వీళ్లిద్దరికి లక్ ఏమన్నా కలిసొస్తుందేమో చూడాలి మరి.