#బాస్ పార్టీ.. వీర‌య్య అభిమానుల‌కు పూన‌కాలే

Update: 2022-11-14 04:08 GMT
మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఊపు తెచ్చే మాస్ పాట‌లు.. హీటెక్కించే బ్రేక్ డ్యాన్సులు.. మ‌తిచెడే కాన్సెప్ట్ బేస్డ్ స్టెప్పులు.. వీట‌న్నిటినీ మించి క్లాసీ బాడీ లాంగ్వేజ్... అంత‌కుమించి డైలాగుల్లో విరుపు.. ఫైటింగుల్లో రుబాబ్.. ఇలా అన్ని అంశాల మేలు క‌ల‌యిక‌తో ఒక రేంజులో రంజుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తెర‌కెక్కేవి. తొంబైల‌లో బాస్ ఒక రేంజులో ఏలారు. చిరు సినిమా అంటే మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అంద‌రూ థియేట‌ర్లకు వ‌స్తుంటారు. మెగాస్టార్ న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్- ఘ‌రానా మొగుడు- ముఠా మేస్త్రి- రౌడీ అల్లుడు లాంటి మాస్ సినిమాలు ఇప్ప‌టికీ బుల్లితెర వీక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తుంటాయి. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి విల‌క్ష‌ణ‌మైన‌ ప్ర‌భావ‌వంత‌మైన న‌టుడిగా చిరంజీవి గురించి ప్ర‌ముఖ జాతీయ ప‌త్రిక‌లే క‌థ‌నాలు రాసాయంటే అర్థం చేసుకోవాలి.

చిరు రాజ‌కీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి 'ఖైదీనంబ‌ర్ 150'తో కంబ్యాక్ అయిన విధానం ఆ చిత్రంలో అత‌డు ప్ర‌ద‌ర్శించిన అద్భుత న‌ట‌న‌- ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌కు ఫ్యాన్స్ గ‌గ్గోలు పెట్టారు. ఆ తర్వాత‌ సైరా న‌ర‌సింహారెడ్డిగా వీర‌త్వం ప్ర‌ద‌ర్శించిన తీరుకు స్పెల్ బౌండ్ అయిపోయారు. జాతీయ మీడియాలు సైతం సైరా న‌ర‌సింహారెడ్డిని ప్ర‌శంసించాయి. ఇటీవ‌లే గాడ్ ఫాద‌ర్ చిత్రంలో ఎంతో డిగ్నిఫైడ్ పాత్ర‌తో త‌న రేంజుకు త‌గ్గ న‌ట‌న‌తో చిరు ఓల‌లాడించారు. అయితే మెగాస్టార్ ని తిరిగి ఘ‌రానా మొగుడు- రౌడీ అల్లుడు త‌ర‌హా మాస్ పాత్ర‌ల్లో చూడాల‌ని మాస్ అభిమానులు చాలా కాలంగా ఎంత‌గానో ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఆ దాహం తీర్చేందుకు బాస్ ఇప్పుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో 'వాల్తేరు వీర‌య్య‌'గా వ‌స్తున్నారు. ఈ టైటిల్లోనే బోలెడంత మాసిజం ఉంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూడ‌గానే మ‌ళ్లీ మ‌రో ముఠామేస్త్రి- ఘ‌రానామొగుడు - రౌడీ అల్లుడు టింజ్ క‌నిపిస్తోంద‌ని అభిమానులు ఖుషీ అయిపోయారు.

మెగాస్టార్ పూర్తి స్థాయి మాస్ రోల్ లో కనిపించబోతున్న వాల్తేరు వీర‌య్య 2023 సంక్రాంతి బ‌రిలో సంద‌డి చేయ‌బోతోంది. మ‌రో రెండు నెల‌ల స‌మ‌య‌మే మిగిలి ఉండ‌డంతో వీర‌య్య ప్ర‌చార హంగామాకు తెర తీయ‌నున్నారు. ఇప్పుడు ఈ మూవీ నుండి మొదటి సింగిల్ విడుదల కోసం ప్రతి మెగాభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంత‌లోనే స్వరకర్త రాక్ స్టార్ డీఎస్పీ అదిరిపోయే అప్ డేట్ చెప్పారు. వీర‌య్య నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ పాట‌కు '#బాస్ పార్టీ' అని ట్యాగ్ త‌గిలించి దేవీశ్రీ ఒక‌టే హైప్ పెంచేశాడు.

మెగాస్టార్ ఎనర్జిటిక్ స్టెప్పుల‌తో థియేటర్లు ద‌ద్ద‌రిల్ల‌డం ఖాయ‌మ‌ని అత‌డి ఎక్స్ ప్రెష‌న్ చెబుతోంది. బాస్ కోసం అదిరే ట్యూన్ రెడీ. ఇందులో డ్యాన్సులు ఒక రేంజులో కిక్కిస్తాయ‌ని దేవీశ్రీ ఎంతో ఉల్లాసంగా చెబుతున్నారు. ఈ వారంలోనే మొదటి సింగిల్ విడుదల కానుండగా అభిమానుల్లో చాలా ముందే పూన‌కాలు తెప్పించాడు.

ఇప్ప‌టికే టీజ‌ర్ కోసం అదిరిపోయే నేప‌థ్య‌సంగీతం అందించిన దేవీశ్రీ వాల్తేరు వీర‌య్య‌లో ఒక్కో పాట‌ను ఒక్కో క్లాసిక్ గా రూపొందిస్తున్నాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. బాస్ ఎన‌ర్జీ లెవ‌ల్.. డ్యాన్సుల‌కు సింక్ అయ్యే మ్యూజిక్ దేవీశ్రీ నుంచి అభిమానులు ఆశిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టే తాజాగా అత‌డి ప్ర‌క‌ట‌న అమాంతం హైప్ పెంచేసింది. దేవీశ్రీ ఇచ్చిన లీక్ ఇప్పుడు మెగా వాట్సాప్ గ్రూపుల్లో పెను దుమారంగా మారింది. గాడ్ ఫాద‌ర్ లో మాస్ పాట‌లు డ్యాన్సుల‌కు ఆస్కారం లేదు.. కాబ‌ట్టి ఆ లోటును భ‌ర్తీ చేస్తూ వాల్తేరు వీర‌య్య మాస్ ఫ్యాన్స్  కి ఒక రేంజులో ట్రీటివ్వ‌నున్నాడ‌ని చాలా ముందే అంచనాలేర్ప‌డ్డాయి. తొలి సింగిల్ తో అది ప‌రాకాష్ఠ‌కు చేరుకోనుంద‌ని ఇప్పుడు రాక్ స్టార్ దేవీశ్రీ భ‌రోసానిచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News