ఎస్వీఆర్ తర్వాత బ్రహ్మీకే!!

Update: 2017-10-04 05:39 GMT
చలన చిత్రోత్సవాల్లో ప్రముఖులకు.. సీనియర్లకు సన్మానాలు చేయడం చూస్తూనే ఉన్నాం. లైఫ్ టైం అఛీవ్మెంట్ లాంటి అవార్డులు చేతికి ఇచ్చి మరీ.. పలువురు ఇండస్ట్రీ పెద్దలతో సన్మానాలు చేస్తున్నారు. అయితే.. అన్ని అవార్డులకు ఒకే మాదిరి విలువ ఎలా ఉండదో.. కొన్ని ప్రత్యేకమైన సన్మానాలకు కూడా ఎంతో ప్రత్యేకమైన వాల్యూ ఉంటుంది.

హాస్యబ్రహ్మగా టాలీవుడ్ ప్రేక్షకులతో బ్రహ్మరథం పట్టించుకుంటున్న బ్రహ్మానందంకు ఇలాంటి ఓ అరుదైన సత్కారం జరగబోతోంది. అమెరికాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ వారు.. బ్రహ్మానందంకు గౌరవ సత్కారం చేయనున్నారు.  మరో రెండు రోజుల్లో.. అంటే అక్టోబర్ 6న అమెరికాలో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ జరగబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే బ్రహ్మానందంను సత్కరించబోతున్నారు. ఇలాంటి అరుదైన సత్కారాన్ని గతంలో ఎస్వీ రంగారావు మాత్రమే అందుకున్నారు. 1964లో జరిగిన జకార్తా చలన చిత్రోత్సవాల్లో ఎస్వీఆర్ ఈ ఘనతను అందుకున్నారు. ఆ తర్వాత ఇలా సత్కారం అందుకోబోతోన్న తెలుగు నటుడు బ్రహ్మానందం మాత్రమే కావడం విశేషం.

ప్రస్తుతం బ్రహ్మానందం కూడా అమెరికాలోనే ఉన్నారు. ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ యూఎస్ లో జరుగుతుండగా.. సుదీర్ఘ కాలంగా ఇక్కడే షూటింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సత్కార కార్యక్రమం కూడా జరుగుతుండడం విశేషం. ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కూడా పొందిన బ్రహ్మానందం కెరీర్ లో.. ఇప్పుడీ అవార్డ్ మరో కలికితురాయిగా చెప్పవచ్చు.
Tags:    

Similar News