భారతీయ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమలోని ఇతర కళలను కూడా ప్రదర్శిస్తూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. కొందరు హీరోలు సొంతంగా కథలు రాసుకోవడమే కాదు.. దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. కమల్ హాసన్ - అమీర్ ఖాన్ - ధనుష్ - లారెన్స్ వంటి వారు సొంత కథలతో మంచి విజయాలను అందుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ 'జానీ' 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి సినిమాలకు కథలు రాయడమే కాదు.. పలు చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. యువ హీరో అడవి శేష్ కథ - స్క్రీన్ ప్లే రాసుకుంటూ మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు. నాగశౌర్య కూడా సొంత కథలతో సినిమాలు చేశారు. కిరణ్ అబ్బవరం - సిద్ధు జొన్నలగడ్డ వంటి పలువురు కుర్ర హీరోలు కూడా ఓన్ గా కథ కథనం మాటలు రాసుకోవడంలో ఆరితేరినవారే. అయితే తాజాగా అల్లు అర్జున్ కూడా సొంతంగా ఓ కథ రాసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
బన్నీ కెరీర్ ప్రారంభం నుంచీ ఎప్పటికప్పుడు సరికొత్త కథలను తనకు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టే స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విజయాలు అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగారు. ఏ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందనే విషయంలో అతనికి మంచి అనుభవం ఉంది. అల్లు అర్జున్ జడ్జిమెంట్ ఎక్కువ శాతం కరెక్ట్ గా ఉంటుందని ఇప్పటి వరకు ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ మరియు సక్సెస్ రేట్ చూస్తే అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు బన్నీ స్వయంగా ఓ స్టోరీ రాయడానికి రెడీ అయ్యారట.
ఇటీవల అల్లు అర్జున్ తన వద్ద ఉన్న ఓ ఐడియా గురించి కొంతమంది సన్నిహిత రచయితలతో చర్చించారట. వారి సలహాలు సూచనలతో తన ఆలోచనను పేపర్ మీదకు తీసుకురావాలని బన్నీ భావిస్తున్నారట. త్వరలోనే కథ రాసే విషయం మీద ఓ నిర్ణయానికి రావాలని స్టార్ హీరో అనుకుంటున్నారట. ఇది నిజమేనా లేదా గాలి వార్త అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప: ది రైజ్' సినిమా సక్సెస్ జోష్ లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా హిందీలో అయితే ఎవరూ ఊహించని విధంగా 100 కోట్ల నెట్ కలెక్షన్ తో ఆశ్చర్య పరిచింది. ఈ క్రమంలో బన్నీ తనకంటూ సొంతంగా నేషనల్ వైడ్ మార్కెట్ ఏర్పరచుకున్నాడు.
'పుష్ప' పార్ట్-1 సక్సెస్ కావడంతో దానికి కొనసాగింపుగా రాబోయే 'పుష్ప: ది రూల్' సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన అల్లు అర్జున్.. మార్చిలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా క్రేజ్ ను కాపాడుకునేలా రాబోయే సినిమాల విషయంలో బన్నీ మరింత జాగ్రత్తగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.