‘2.0’ నిర్మాతలకు బన్నీ వాసు ఫిట్టింగ్

Update: 2017-12-03 08:20 GMT
2.0.. ఇప్పుడు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. దాని మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’కి దీటైన సినిమా అవుతుందని భావిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని బట్టి.. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో సినిమాల్ని షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐతే ‘2.0’ రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు నిలకడ మీద ఉండట్లేదు. ముందు ఈ ఏడాది దీపావళికే రిలీజ్ అన్నారు. ఆ తర్వాత జనవరి 25 అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇంతలోనే ఏప్రిల్ 13కు వాయిదా అన్నారు. తాజాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ కచ్చితమైన డేట్ చెప్పకుండా ఏప్రిల్లో రిలీజ్ అని ప్రకటించింది.

ఐతే ఇలా మళ్లీ మళ్లీ డేట్ మార్చడం వల్ల మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది ఎదురవుతోంది. ఎంత భారీ సినిమా అయినప్పటికీ ఇలా ఇష్టానుసారం డేట్ మార్చడం పట్ల టాలీవుడ్ నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ అసహనాన్నే ‘నా పేరు సూర్య’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు కూడా చూపించాడు. ‘2.0’ ఏప్రిల్ 27నే విడుదల కానున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అలా కుదరదని స్పష్టం చేస్తున్నట్లుగా ఫేస్ బుక్ లో ‘2.0’ నిర్మాతల్ని ఉద్దేశించి ఒక పోస్టు పెట్టాడు బన్నీ వాసు.

తాము ‘2.0’ సినిమాను గౌరవిస్తామని.. కానీ పదే పదే రిలీజ్ డేట్ మార్చడం వల్ల ప్రాంతీయ సినిమాలకు ఇబ్బంది అవుతోందని.. తాము ‘భరత్ అను నేను’ టీంతో రిలీజ్ డేట్ విషయంలో చర్చలు జరుపుతున్నామని.. ‘2.0’కు సంబంధించిన ఇష్యూను ఏపీ-తెలంగాణ నిర్మాతల మండలి.. ఎగ్జిబిటర్ల సంఘాల దృష్టికి తీసుకెళ్తామని.. తాము ఎంచుకున్న డేట్ విషయంలో కట్టుబడి ఉంటామని.. ఇది భవిష్యత్తులో ప్రాంతీయ సినిమాలకు మేలు చేస్తుందని అతను అన్నాడు. తెలుగులో పెద్ద సినిమాలు రిలీజవుతున్నపుడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కాకూడదని టాలీవుడ్లో ఒక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ‘2.0’ సినిమాను ఏప్రిల్ 27న విడుదల కానివ్వకుండా కట్టడి చేయాలనే పట్టుదలతో బన్నీ వాసు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి తెలుగులో తమ చిత్రానికి థియేటర్లు ఇవ్వని పరిస్థితి తలెత్తేలా ఉంటే ‘2.0’ నిర్మాతలు డేట్ మార్చుకోక తప్పదేమో.
Tags:    

Similar News