బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి సినిమాపై వివాదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. కర్ణిసేన కార్యకర్తలు..... దీపికా - భన్సాలీల తలలకు వెలకట్టిన సంగతి తెలిసిందే. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, దీపిక కూడా వారి చాలెంజ్ ను స్వీకరించి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అయితే, ఇప్పటివరకు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఆ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని, ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ ప్రసూన్ జోషి క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే, తాజాగా ఆ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ)కు పంపారు. అయితే, అనూహ్యంగా ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించలేదని, ఆ చిత్రాన్ని వెనక్కు పంపించేశారని వార్తలు వస్తున్నాయి.
గత వారమే ఈ చిత్రాన్ని సెన్సార్ కోసం పంపారట. అయితే, ఆ చిత్ర నిర్మాతలు..... సెన్సార్ కు సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని సమాచారం. అందుకే, ఆ సినిమా సిర్టిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదట. నిర్మాతలు దరఖాస్తును పూర్తి చేసి పంపిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తామని సీబీఎఫ్ సీ సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందించింది. ఆ మాట నిజమేనని, కానీ సినిమా మాత్రం సీబీఎఫ్ సీ దగ్గరే ఉందని తెలిపింది. అది కేవలం ఓ చిన్న సాంకేతిక లోపమని, చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని చెప్పింది. మరోవైపు, రాజ్ పుత్ కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో దీపికకు భద్రత పెంచారు. వారి వార్నింగ్ లను లెక్కచేయకుండా దీపిక ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇన్ని వివాదాల నేపథ్యంలో సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.