ఎమ్మెల్యే ఆడియో వేడుకకు సీఎం ముఖ్య అతిథి

Update: 2015-03-16 08:23 GMT
బాలయ్య ఇప్పుడు జస్ట్‌ బాలయ్య కాదు.. ఎమ్మెల్యే బాలయ్య. హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే గెలిచి ఎమ్మెల్యే అయిన బాలయ్య.. ప్రజాప్రతినిధిగా ఉంటూనే సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఆయన చేసిన తొలి సినిమా.. లయన్‌. కొత్త దర్శకుడు సత్యదేవా రూపొందించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకునే దశలో ఉంది. ఏప్రిల్‌ నెలాఖరులో విడుదలయ్యే ఈ సినిమాకు ఆడియో రిలీజ్‌ ముహూర్తం కుదిరింది. ఏప్రిల్‌ 9న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆడియో వేడుక జరగనుంది. గత ఏడాది లెజెండ్‌ విడుదలైన మార్చి 28న ఆడియో రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు కానీ.. అప్పటికింకా షూటింగ్‌ పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో హడావుడి లేకుండా ఏప్రిల్‌ 9న కార్యక్రమం చేయాలని నిర్ణయించారు.

ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా రాబోతుండటం విశేషం. చంద్రబాబు బాలయ్య సినిమాల వేడుకకు అతిథిగా హాజరై చాలా కాలమైంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. వియ్యంకుడి కోసం లయన్‌ వేడుకకు రాబోతున్నారాయన. అధికార పార్టీకి చెందిన మరికొందరు నేతలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గనబోతున్నారు. నందమూరి అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో బాలయ్యకు ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చిన మణిశర్మ చాలా గ్యాప్‌ తర్వాత బాలయ్య సినిమాకు పని చేస్తున్నాడు. లయన్‌తో మళ్లీ తనేంటో ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నాడు మణిశర్మ. లెజెండ్‌ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో లయన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.


Tags:    

Similar News