నిరాశపడటం .. నిరుత్సాహపరచడం తెలియని బాలు!

Update: 2021-06-05 11:30 GMT
ఒక గాయకుడు కొన్ని తరాల పాటు శ్రోతలను తరింపజేయడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు. అలాగే ఒక భాషలో మాత్రమే కాకుండా అనేక భాషల్లోనూ ఆదరణ పొందడం .. ఆరాధించబడటం కూడా అంత తేలికైన విషయమేం కాదు. కానీ బాలు విషయంలో అవన్నీ కూడా అవలీలగా జరిగిపోయాయి. అందుకు కారణం సంగీత సాహిత్యాల పట్ల ఆయనకి గల ఇష్టం. ఎప్పటికప్పుడూ ఆయన చేస్తూ వచ్చిన స్వరాల విన్యాసం. అలాంటి బాలు గురించి ఆయన తనయుడు చరణ్ మాట్లాడారు.

"నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా నాన్నగారు చాలా బిజీ .. ఇంట్లో ఆయన చాలా తక్కువగా ఉండేవారు. మాకు సంబంధించిన అన్ని విషయాలను మా అమ్మగారే చూసుకునేవారు. నేను విదేశాలకి వెళ్లి చదువుకుని వచ్చిన తరువాత, గాయకుడిగా నన్ను ఇళయరాజాగారు ప్రోత్సహించారు. కొంతకాలం పాడిన తరువాత సింగర్ గా అవకాశాలు తగ్గాయి. దాంతో నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్లాను. ఆ విషయంలో అమ్మ కూడా కొంత అసంతృప్తిగా ఉండేవారు. నాన్నగారు మాత్రం ఎప్పుడూ నిరాశపడలేదు .. నిరుత్సాహపరచలేదు. మంచి సమయం వస్తుంది .. వెయిట్ చేయి అనేవారు.

అలా నాన్నగారు నాకు ఎంతో సపోర్ట్ గా ఉండేవారు. ఆ సమయంలో నేను టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టాను. అలా ఒక వైపున నటిస్తూనే మరో వైపున సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాను. ఆ సినిమాలు కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. పరాజయంపాలైనా ఫరవాలేదు .. డబ్బు కోసం నాశిరకం సినిమాలు చేయవద్దని మాత్రం చెప్పేవారు. ఏది చేసినా ఆయనకి చెప్పకుండా మాత్రం చేయలేదు. ఆయన ఆశీస్సులతోనే అడుగుముందుకు వేశాను. ఓ నిర్మాతగా ఆయన పేరును నేను ఎప్పుడూ చెడగొట్టలేదు" అని చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News