తమిళ సినిమాల టికెట్ల రేట్లు ఎంతంటే..

Update: 2017-10-14 08:14 GMT
జీఎస్టీ అమలుతో మన దగ్గర మల్టీప్లెక్సుల్లో టికెట్ల రేట్లు కొంత మేర పెరిగిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్లలో కూడా ధరల పెంపు దిశగా అడుగులు పడేలా కనిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాట థియేటర్లలో టికెట్ల రేట్లపై అనేక తర్జన భర్జనల తర్వాత ఒక స్పష్టత వచ్చింది. 28 శాతం జీఎస్టీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం విధించే 10 శాతం అదనపు పన్నుతో ఒక్కసారిగా అక్కడ టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఐతే రాష్ట్ర ప్రభుత్వ పన్ను తీసేయాలంటూ కొన్ని రోజులుగా అక్కడి నిర్మాతలు.. థియేటర్ల యజమానులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు వారాలుగా కొత్త సినిమాల విడుదలను కూడా ఆపేశారు.

ఐతే పన్ను రద్దుకు ప్రభుత్వం అంగీకరించకపోయినా.. కొంత మేర తగ్గించడానికి మాత్రం అంగీకరించింది. ఆ తగ్గింపు మరీ ఎక్కువేమీ లేదు. రెండు శాతం తగ్గించి 8 శాతం ఫిక్స్ చేసింది ప్రభుత్వం. పన్ను విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో నిర్మాతల మండలి కూడా సర్దుకుపోక తప్పని పరిస్థితి నెలకొంది. దీపావళికి ‘మెర్శల్’ లాంటి భారీ సినిమా విడుదల కావాల్సి ఉండటంతో నిరసనను ఇంకెంతో కాలం కొనసాగించే పరిస్థితి లేకపోయింది. ఇక తాజా పన్ను లెక్కల ప్రకారం తమిళనాడు సింగిల్ స్క్రీన్లలో ఏసీ థియేటర్లకు రూ.127.. నాన్-ఏసీ థియేటర్లకు రూ.101గా టికెట్ రేటు ఖరారు కానుంది. దీన్ని రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి. ఇక మల్టీప్లెక్సుల్లో టికెట్ల రేట్లు కనిష్టంగా రూ.150.. గరిష్టంగా రూ.207 కానున్నాయి. దీపావళికి ‘మెర్శల్’ విడుదలతో కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
Tags:    

Similar News