కమల్ భయం.. నిఖిల్ కు శాపం

Update: 2015-11-02 08:30 GMT
తెలుగు సినిమా చేస్తా.. తెలుగు సినిమా చేస్తా.. అని కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్న కమల్ హాసన్ ఇంతకుముందులా నేరుగా తెలుగు సినిమా చేయకున్నా.. ‘తూంగావనం’ సినిమానే తెలుగులో వేరుగా తీసి.. కొంత వరకు తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తన సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ తమిళంలో విడుదలకు ఏ ఇబ్బందులూ లేవు కానీ.. తెలుగులో మాత్రం పరిస్థితులు ఆయనకు అంత అనుకూలంగా కనిపించట్లేదు. ‘అఖిల్’ సినిమా భారీ హైప్ మధ్య విడుదలవుతుండటం.. తెలుగు ప్రేక్షకుల ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉండటం.. థియేటర్ల సమస్య కూడా ఉండటంతో ‘చీకటి రాజ్యం’ను వారం వాయిదా వేసినట్లు సమాచారం.

ముందు తమిళంలో 10వ తారీఖున విడుదల చేసి.. అఖిల్ సినిమా వచ్చిన మరుసటి రోజు, 12న ‘చీకటి రాజ్యం’ విడుదల చేద్దామనుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకట్లేదు. సి.కళ్యాణ్ లాంటి వాళ్ల హ్యాండ్ ఉంటే పనైపోయేది కానీ.. ‘చీకటి రాజ్యం’ సినిమాను కమలే సొంతంగా రిలీజ్ చేస్తుండటంతో చిక్కు వచ్చి పడింది. పైగా ‘అఖిల్’ భయం కూడా కొంచెం ఉంది. దీంతో సినిమాను 20వ తేదీకి వాయిదా వేసేసినట్లు తెలిసింది. ఐతే ఆ రోజు సోలోగా బాక్సాఫీస్ రైడ్ చేద్దామనుకుంటున్న నిఖిల్ కు ఇబ్బంది వచ్చి పడింది. ‘శంకరాభరణం’ సినిమా ‘చీకటి రాజ్యం’తో పోటీ పడక తప్పేలా లేదు. ఇది కచ్చితంగా ఆ సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News