డేరింగ్ డాషింగ్ డైన‌మిక్ 'కె.టి.ఆర్‌' - చిరంజీవి

Update: 2018-12-27 17:43 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `వినయ విధేయ రామ` అన్ని ప‌నులు పూర్తి చేసుకుని భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక నేటి సాయంత్రం హైద‌రాబాద్‌ లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ట్రైల‌ర్ రిలీజై సంక్రాంతికి ముందే ఫ్యాన్స్‌కు పెద్ద‌ పండ‌గ తెచ్చింది. ఈ మెగా ఈవెంట్‌ కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ వేదిక ఆద్యంతం రామ్ చ‌ర‌ణ్ - తార‌క రామారావు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహంపై జ‌నం క‌థ‌లు క‌థ‌లు గా చెప్పుకోవ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. అంతేకాదు ఈ వేదిక‌పై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కేటీఆర్ డైన‌మిజం గురించి ఆయ‌న వాక్చాతుర్యం గురించి, నాయ‌కుడిగా త‌న‌లోని స‌మ‌ర్ధ‌త గురించి గొప్ప ప్ర‌శంస‌లు కురిపించారు.

వేదిక‌నెక్కి మాట్లాడ‌టంలో కేటీఆర్ ఎంతో స‌మ‌ర్థుడు అని పొగిడేసిన చిరు.. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఆంగ్ల భాష‌లో మాట్లాడుతూ తెలుగు వాడి గౌర‌వాన్ని తార‌క రామారావు పెంచార‌ని ప్ర‌శంసించారు. అసెంబ్లీలో త‌న‌తో పాటే కూచుని ఉన్న త‌న‌ని చూసి మ‌రీ ఇంత విన‌య విధేయ రామా ఏంటి? అని అనుకున్నాన‌ని, అయితే తాను మ‌రీ అంత విన‌యంతో (న‌వ్వేస్తూ) ఉండే కుర్రాడేమీ కాద‌ని.. మాట‌ల తూటాల‌తో ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డే గొప్ప స‌మ‌ర్ధుడ‌ని కేటీఆర్ ని ఆకాశానికెత్తేశారు. డేరింగ్ డ్యాషింగ్ డైన‌మిక్ లీడ‌ర్ ఎవ‌రంటే ఆ మూడ‌క్ష‌రాలు కె.టి.ఆర్ అని పొగిడేశారు మెగాస్టార్.  వేదిక‌ ఆద్యంతం కేటీఆర్ స్పీచ్ - మెగాస్టార్ స్పీచ్ - ఆ స్పీచ్ ల‌లో కామెడీ - సెటైర్ ప్ర‌త్యేకంగా ర‌క్తి క‌ట్టించాయి. ఆ ఇరువురు ఒక‌రిపై ఒక‌రు చ‌క్క‌ని చ‌క్కిలిగింత‌లు పెట్టే సెటైరిక‌ల్ స్పీచ్‌ లతో హుషారెత్తించారు. చిరు- చ‌ర‌ణ్ ప‌క్క‌ప‌క్క‌నే ఉంటే అన్న‌ద‌మ్ముల్లానే ఉన్నార‌ని కేటీఆర్ ఛ‌మ‌త్క‌రించ‌గా,  కేటీఆర్ స‌మ‌ర్ధ‌త‌ను పొగిడేస్తూనే కేటీఆర్ లోని ఇన్న‌ర్ క్వాలిటీస్ ని మెగా బాస్ పొగిడేశారు. ప్ర‌స్తుతం కోటాను కోట్ల అభిమానుల్లో ఈ వేదిక ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కొచ్చింది.
Tags:    

Similar News