వయస్సు నా శరీరానికే, మనస్సుకు కాదు

Update: 2015-08-22 12:08 GMT
మెగాస్టార్‌ చిరంజీవి షష్టిపూర్తి, 60వ పుట్టినరోజు వేడుక అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకల్లో చిరు తన మనసులోని బోలెడన్ని సంగతుల్ని ఇలా ముచ్చటించారు. ఆ విశేషాలేంటో చూద్దామా?

= 60ఏళ్లు వచ్చేశాయని అభిమానులు గుర్తు చేశారే తప్ప నేనింకా నిత్య యవ్వనుడినే. వయసు శరీరానికే తప్ప మనసుకి కాదు కదా? శారీరకంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి. దాంతోపాటే మానసిక ఆనందమూ ముఖ్యం. ఈ రెండిటిలో దేవుడు లోటు చేయలేదు.

= ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 35ఏళ్లు ఎలా గడిచాయో అనిపిస్తోంది. ఈ సుధీర్ఘ పయనాన్ని ఊహించలేదు. అప్పట్లో పెద్ద పెద్ద లక్ష్యాలేవీ ఉండేవి కావు. ఉన్న అవకాశం ఎలా అందిపుచ్చుకుని న్యాయం చేయగలను? అత్యుత్తమ ప్రదర్శన ఎలా? అనేదే ఆలోచించేవాడిని. రేపేంటి? భవిష్యత్‌ ఏంటి? అనేది ఆలోచించేవాడినే కాదు. బహుశా చిన్న చిన్న లక్ష్యాలే నన్ను నడిపించి ఈస్థాయికి తెచ్చాయేమో?

= అభిమానులే నాకు స్ఫూర్తి. వారికోసం ఎంత కష్టమైనా పడొచ్చు. వాళ్లకు కొత్తగా ఏం చేయాలి అనుకునే పసివాడి ప్రాణంతో చిత్రంలో బ్రేక్‌ డ్యాన్సుల్ని ప్రవేశ పెట్టా. అభిమానులుకు నచ్చాయి. మళ్లీ మళ్లీ కొత్తగా ఏం చేయాలి అనుకుని ప్రయత్నించా. బావగారూ బాగున్నారా చిత్రంలో 240 అడుగులు ఎత్తు నుంచి బంగీ జంప్‌ చేశాను. థియేటర్లలో విజిల్స్‌ వేశారు. ఆ ఉత్సాహమే నన్ను ముందుకు నడిపించింది.

= చరణ్‌ - బన్ని - సాయిధరమ్‌ - వరుణ్‌తేజ్‌ - శిరీష్‌ ఇంతమంది హీరోలు మా ఫ్యామిలీ నుంచి వచ్చారు. మా కుటుంబ హీరోలంతా కలిసి ఒకే సినిమాలో నటిస్తే పండుగలా ఉంటుంది. కానీ అలాంటి కథ దొరుకుతుందా? ఒకవేళ అలాంటి కథ వస్తే, మేమంతా కలిసి నటిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమా చూడడానికి అందరికంటే నేనే ముందుంటా.
Tags:    

Similar News